సాక్షి, విశాఖపట్నం/మధురవాడ: ‘బాగున్నావా అన్నా? మన వాళ్లంతా ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులు బాగున్నారా? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులను పేరు పేరునా పలకరించారు. వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని, ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని హితవు పలికారు. గురువారం సాయంత్రం పీఎంపాలెం డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం స్టేడియంలో అండర్–19 మహిళా క్రికెటర్లు, రంజీ ఆటగాళ్లను అభినందించారు. ఆ తర్వాత భీమిలి నియోజకవర్గం నేతలతో ముచ్చటించారు. ఒక్కో నాయకుడి పేరును చిరునవ్వు చిందిస్తూ తెలుసుకున్నారు. వారి చేతిలో చేయి వేశారు. ఆయా నాయకుడి మెడలో శాలువా కప్పారు. కొంతమంది నాయకులు తమ ఆరోగ్య సమస్యలను, మరికొందరు నియోజకవర్గంలో చేపట్టాల్సి ఉన్న పనులను వివరించారు.
ఇంకొందరు ఆయన అందిస్తున్న పరిపాలన మెచ్చుకున్నారు. ‘మీరు పరిపాలిస్తున్నది మనుషులను కాదు.. మనసులను సార్’ అంటూ తమ మనసులోని మాటను చెప్పారు. మేమంతా మీ వెంటే ఉంటాం, మళ్లీ మళ్లీ మీరే సీఎం కావాలంటూ అభిలషించారు. ఒకప్పుడు ఎస్సీ కాలనీలు ఊరికి దూరంగా ఉండేవని, జగనన్న కాలనీల ఏర్పాటు ద్వారా అన్ని వర్గాల వారికి ఒకే చోట ఇళ్లు నిర్మించి ఇస్తున్నారంటూ సీఎంను దళిత నాయకులు కొనియాడారు.
సమస్యలపై వినతులు
పద్మనాభం మండలం అనంత పద్మనాభస్వామి ఆలయం ఘాట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మరో నేత కోరారు. ఆనందపురం మండలం జగన్నాథపురంలో గ్రేహౌండ్స్ కోసం ప్రభుత్వం తీసుకున్న భూమికి ఇంకా ఇవ్వాల్సిన రూ.8 కోట్ల పరిహారం త్వరలో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ మండల నాయకుడొకరు విజ్ఞప్తి చేశారు. సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని 98వ వార్డు నాయకులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
89వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అక్రమాలకు అంతే లేకుండా పోతోందని, వాటి వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆ వార్డు నాయకుడు తీసుకెళ్లారు. పార్టీలో మరో సీనియర్ నాయకుడిని ఎలా ఉన్నావు అన్నా.. అంటూ పలకరించారు. ఆరోగ్యం బాగోలేదు సార్.. అని చెప్పగానే ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. ఇలా తెలిసిన నాయకులను పేరు పేరునా పలకరించారు. తెలియని వారి పేర్లనూ తెలుసుకొని కుశల ప్రశ్నలు అడిగారు. దాదాపు అరగంట సేపు ఒక్కొక్కరినీ కలుస్తూ ముందుకు సాగారు. యోగక్షేమాలు అడిగాక వారి మెడలో శాలువాలు కప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ పట్ల చూపించిన ఆప్యాయత, అనురాగాలకు వీరంతా ఎంతో ఖుషీఖుషీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment