కేఏ పాల్‌ ఆమరణ నిరాహార దీక్ష | - | Sakshi
Sakshi News home page

కేఏ పాల్‌ ఆమరణ నిరాహార దీక్ష

Aug 29 2023 1:00 AM | Updated on Aug 29 2023 12:49 PM

- - Sakshi

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆశీల్‌మెట్టలోని కేఏ పాల్‌ కన్వెన్షన్‌ హాల్‌ ఆవరణలో ఆయన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పాల్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ నాయకులు కేంద్రానికి బానిసలుగా మారారని విమర్శించారు.

స్టీల్‌ప్లాంట్‌ కోసం 16 వేల మంది భూదానాలు, 32 మంది ప్రాణాలర్పించారన్నారు. లక్షల కోట్లు లాభాలు తెస్తూ.. రూ.8 లక్షల కోట్లు విలువైన స్టీల్‌ప్లాంట్‌ను రూ.4 వేల కోట్లకు అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దీనిపై కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ ఇప్పుడు యువతను మోసం చేస్తున్నారన్నారు.

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాని మోదీ, చంద్రబాబే కారణమని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా తాను రూ.4 వేల కోట్లు, తరువాత రూ.40 వేల కోట్లు ఇచ్చి స్టీల్‌ప్లాంట్‌ను నడిపిస్తానన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ద్వారా ఏడాదికి లక్ష కోట్లు లాభం చూపిస్తానన్నారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు పది లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని పాల్‌ చెప్పారు. ఇంత పెద్ద స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం, స్మార్ట్‌ సిటీ, రెండు కోట్ల ఉపాధి లేకుండా పోయాయని ఆరోపించారు. రాష్ట్రం అప్పులు భారం తీర్చే సత్తా స్టీల్‌ప్లాంట్‌కు మాత్రమే ఉందన్నారు. యువతి, యువకులు, ప్రజలు తరలివస్తే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement