ఐవీఆర్‌ఎస్‌ ఆంతర్యమేమి? | - | Sakshi
Sakshi News home page

ఐవీఆర్‌ఎస్‌ ఆంతర్యమేమి?

Published Sun, Mar 31 2024 1:25 AM | Last Updated on Sun, Mar 31 2024 7:45 AM

- - Sakshi

మొన్న యలమంచిలి, నిన్న పెందుర్తి..

ఈ అభ్యర్థులపై మరోసారి జనసేన సర్వే

వారిపట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై ఆరా

మళ్లీ మార్పులు చేయడానికేనని శ్రేణుల అనుమానం

జనసేనలో కొనసాగుతున్న గందరగోళం

సాక్షి, విశాఖపట్నం : జనసేనలో రోజుకో గందరగోళానికి తెర లేస్తోంది. సీట్ల ప్రకటన నుంచి ఆరంభమైన ఈ అయోమయం అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలు కేటాయించారు. వీటిలో పెందుర్తి, విశాఖ దక్షిణ, అనకాపల్లి, యలమంచిలి అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో విశాఖ దక్షిణ మినహా మిగిలిన మూడు సీట్లను అధికారికంగా ప్రకటించారు. దక్షిణ సీటును తనకే ఖాయం చేశారంటూ వంశీకృష్ణ శ్రీనివాస్‌ ప్రచారం మొదలెట్టారు కూడా.

దీనిపై జనసేన అధికారిక ప్రకటన వెలువరించకపోవడంతో ఆయన ప్రత్యర్థి వర్గం ఆసరాగా తీసుకుని హడావుడి చేస్తోంది. రెండు రోజుల క్రితం జనసేన అధిష్టానం ఐవీఆర్‌ఎస్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం) ద్వారా యలమంచిలి అభ్యర్థి సుందరపు విజయకుమార్‌పై అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆయన అభ్యర్థిత్వంపై మీ అభిప్రాయం చెప్పండంటూ ఆ నియోజకవర్గంలో కొంతమంది ఫోన్లకు ఐవీఎఆర్‌ఎస్‌ వస్తోంది. ఇప్పటికే టికెట్‌ ప్రకటించిన అభ్యర్థిపై మళ్లీ ఐవీఆర్‌ఎస్‌ ఏమిటంటూ విజయకుమార్‌తో పాటు జనసేన శ్రేణుల్లోనూ అలజడి రేగింది.

పంచకర్ల వర్గీయుల ఉలిక్కిపాటు
ఈ గందరగోళం సద్దుమణగక ముందే తాజాగా పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుపై కూడా జనసేన అధిష్టానం ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది పంచకర్ల వర్గీయులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటికే పెందుర్తి స్థానం పంచకర్లకు ఖరారైందని తెలిసినా.. ఆ సీటు కోసం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రోజూ తన అనుచరులతో ఆందోళనలు, నిరసనలు చేయిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేపై జనసేన నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మార్పు కోసమేనా?
ఈ సర్వేలో యలమంచిలి అభ్యర్థి విజయకుమార్‌కు ప్రతికూలత ఉన్నట్టు తేల్చి ఆ సీటును పంచకర్లకు మార్పు చేస్తారన్న ప్రచారం బాగా జరుగుతోంది. దీంతో పెందుర్తి సీటును బండారుకు కేటాయించే వ్యూహంలో భాగంగా ఈ ఐవీఆర్‌ఎస్‌ ఎత్తుగడ అని జనసేన శ్రేణులు శంకిస్తున్నారు. అయితే సుందరపు విజయకుమార్‌ మాత్రం ఐవీఆర్‌ఎస్‌ సర్వేను తామే తరచూ చేయించుకుంటున్నామని సరికొత్త భాష్యం చెబుతున్నారు.

అందువల్ల తన సీటు మార్పు జరగదని ధీమాతో ఉన్నారు. అనకాపల్లితో పాటు జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఇలా నాలుగు రోజులు, వారానికి ఐవీఆర్‌ఎస్‌ సర్వే ఎందుకు జరగడం లేదంటూ ఆ పార్టీ శ్రేణులే విస్తుపోతున్నారు. త్యాగరాజుగా పేరు గడించిన తమ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. పెందుర్తి సీటును టీడీపీకి కేటాయించరన్న గ్యారంటీ ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద రెండు మూడు రోజులుగా జనసేన నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వే ఆంతర్యమేమిటన్నది ఆ పార్టీ వర్గాలకు అస్సలు అంతుచిక్కడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement