● కలెక్టర్ హరేందిరప్రసాద్
మహారాణిపేట
ఎన్టీఆర్ కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. లేఅవుట్ల వారీగా సమీక్షించిన కలెక్టర్ అక్కడ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల ప్రత్యేక అధికారులు, లేఅవుట్ ఇన్‌చార్జి అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ఇళ్లను పూర్తి చేసే విధంగా తగిన కార్యాచరణ రూపొందించుకొని పనులను సాగించాలని చెప్పారు. అనకాపల్లి జిల్లా కుంచంగి, సబ్బవరం మండలం పెదముషిడివాడలో స్థానికుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, పనులు ముందుకు సాగటం లేదని హౌసింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేఅవుట్ పరిధిలో ఉన్న గ్రావెల్‌ను తవ్వుకొని అక్కడి పనులకు వాడుకుంటున్నప్పటికీ స్థానిక అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని వివరించగా మైన్స్ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ సత్తిబాబు, డీఈలు సూర్యారావు, నారాయణ ప్రసాద్, లేఅవుట్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న ఏడీసీ రమణమూర్తి, యూసీడీ పీడీ సత్యవేణి, డీసీవో ప్రవీణ, ఎస్‌డీసీలు శేష శైలజ, సునీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment