స్టేషన్లలో వదిలేసిన 152 వాహనాల అప్పగింత
విశాఖ సిటీ : ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ దీర్ఘకాలంగా పోలీస్‌స్టేషన్లలో వదిలేసిన వాహనాలను గుర్తించి వాటిని సంబంధిత యజమానులకు అప్పగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా వెహికల్ రిటర్న్ మేళాను బుధవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోలీస్‌స్టేషన్లను సందర్శించిన సమయంలో అక్కడ అనేక బైక్‌లు ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. చాలా కాలంగా వాటి యజమానులు స్టేషన్లలో వదిలివేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. పీఎం పాలెంలో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డ్‌లో కూడా అనేక వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిని సంబంధిత యజమానులకు అప్పగించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. యజమానులు లేని వాహనాల తొలగింపుతో పాటు వేలం ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
1,149 వాహనాల గుర్తింపు
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్లలో మొత్తంగా 1,149 వాహనాలను గుర్తించినట్లు చెప్పారు. పోలీస్ థర్డ్ ఐ, ఆర్టీవో ద్వారా 559 వాహనాల యజమానుల చిరునామా సేకరించామన్నారు. అందులో 272 మంది యజమానులను గుర్తించగా తొలి దశలో 152 వాహనాలను వాటి యజమానులకు అందజేశారు. మరోసారి ఈ మేళా నిర్వహిస్తామన్నారు. యజమానులు లేని వాహనాల వేలం కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా
వెహికల్ రిటర్న్ మేళా నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment