లోకో రన్నింగ్ సిబ్బంది 36 గంటల దీక్ష
తాటిచెట్లపాలెం: ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో దొండపర్తిలో గల డీఆర్‌ఎం కార్యాలయం వద్ద 36 గంటల నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలో గల లోకో రన్నింగ్ సిబ్బంది గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఈ దీక్షను శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్సీ పాణిగ్రాహి, భోలానాఽథ్‌లు మాట్లాడుతూ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు 6 గంటలు, గూడ్స్ రైళ్లకు 8 గంటలు డ్యూటీ పరిమితి అమలుచేయాలని కోరారు. రైల్వేలో మిగతా ఉద్యోగులంతా 8 గంటలు డ్యూటీ చేస్తే లోకోపైలట్లకు మాత్రం సుమారు 11 గంటల వరకు డ్యూటీ ఉంటుందన్నారు. రైళ్ల నిర్వహణలో భద్రతను నిర్ధారించడానికి డ్యూటీ గంటలను తగ్గించాలని వివిధ హైపవర్ కమిటీలు సిఫార్సు చేసినా.. రైల్వే మంత్రిత్వ శాఖ పట్టించుకోవడం లేదన్నారు. లోకో పైలట్స్ డ్యూటీ వేళలను 8 గంటలకు తగ్గించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు కూడా రైల్వే మంత్రిత్వ శాఖ గాలికొదిలేసిందన్నారు. ముఖ్యంగా గూడ్స్ రైళ్లలో లోకో పైలట్లు 12 నుంచి 20 గంటల వరకు డ్యూటీ చేయాల్సి వస్తుందని, దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, అనారోగ్యం పాలవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ దీక్షలో బివిఎస్‌వి రాజు, ఎస్‌కే చౌదరి, ఎం.చిన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment