మహారాణిపేట: ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ గురువారం సమీక్షించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమైన, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉదయం(10–12.30) మధ్యాహ్నం (3–5.30) రెండు పూటలా జరిగే పరీక్షకు 15 నిముషాలు గ్రేస్ పీరియడ్ దాటాక వచ్చేవారిని అనుమతించేది లేదన్నారు. దివ్యాంగులకు, గర్భిణులకు సాధ్యమైనంత మేరకు మొదటి అంతస్తులోనే పరీక్ష గదుల్ని కేటాయించాలని చెప్పారు. ఇన్విజలేటర్లు నిబంధనలు పాటించాలని, పరీక్షకు 5 నిముషాల ముందు మాత్రమే సీల్డ్ కవర్లో ఉన్న ప్రశ్నా పత్రాలను తెరవాలన్నారు. మాస్ కాపీయింగ్, ఇతర సంఘటనలు జరిగాయని పేర్కొంటూ ఆధారం లేకుండా తప్పుడు వార్తలను, సమాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఏడీసీపీ రాజ్ కమల్, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment