దిల్ మ్యాంగో మోర్.!
● ఈసారి ఆశాజనకంగా మామిడి దిగుబడి
● మంచు లేకపోవడంతో కొమ్మల నిండా పూత
● గతేడాది ఎకరాకు 1.5 టన్నుల మామిడి దిగుబడి
● ఈ ఏడాది 3 టన్నుల వరకూ
వచ్చే అవకాశం
● అదే బాటలో జీడిమామిడి దిగుబడి
● జిల్లాలో 3 వేల హెక్టార్లలో మామిడి, 1200 హెక్టార్లలో జీడిమామిడి సాగు
జిల్లాలో మామిడి సాగు 3,000 హెక్టార్లు
పద్మనాభం 2000 హెక్టార్లు
భీమిలి 50 హెక్టార్లు
ఆనందపురం 400 హెక్టార్లు
పెందుర్తి 50 హెక్టార్లు
సేంద్రియ సాగు 30 హెక్టార్లు(పద్మనాభం)
గతేడాది ఎకరానికి దిగుబడి1.5 టన్నులు
ఈ ఏడాది అంచనా 3 నుంచి 4 టన్నులు
జిల్లాలో జీడిమామిడి సాగు 1200 హెక్టార్లు
పద్మనాభం 400 హెక్టార్లు
సింహాచలం 200 హెక్టార్లు
ఆనందపురం 300 హెక్టార్లు
భీమిలి 300 హెక్టార్లు
గతేడాది ఎకరానికి దిగుబడి150 కిలోలు
ఈ ఏడాది అంచనా 250 కిలోలు
సాక్షి, విశాఖపట్నం: గతేడాది నామమాత్రపు దిగుబడులు అందించిన మామిడి ఈసారి రైతుల్ని ఊరిస్తోంది. మొదటి దశలోనే మామిడిపూత విరబూసి అందరిలోనూ ఆశలు నింపుతోంది. జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు పూతలతో కళకళలాడుతున్నాయి. ముందుగానే పూతలు రావడం.. రెండో దశలోనూ నిలబడటంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి దిగుబడి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. మామిడి మాదిరిగానే... జీడి మామిడి కూడా భారీగా పూతతో రైతుల మోముల్లో ఆనందం నింపుతోంది.
కలిసొస్తున్న అనుకూల వాతావరణం
వాతావరణంలో చలితీవ్రత తప్ప.. అకాల వర్షాలు ఇంతవరకూ పడలేదు. దాదాపు ఏప్రిల్ చివరి వరకూ వానలు కురిసే సూచనలు కనిపించడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొగమంచు తీవ్రత కూడా భయపడేంతగా లేదు. ఏటా పొగమంచు ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఉండేది. ఈసారి జనవరి చివరి నుంచే పొగమంచు దాదాపు తగ్గిపోయింది. ఇది మామిడి పూతకు ఎంతో అనుకూల వాతావరణమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మామిడి పూత నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కొంచెం ముందుగానే పూత వచ్చింది. నవంబర్లో వచ్చిన మొదటి పూతతో పాటు డిసెంబర్లో ప్రారంభమైన రెండో దశ పూత కూడా బాగానే ఉంది. గతేడాదితో పోలిస్తే.. ఈసారి పెద్ద మొత్తంలో మామిడి పూత పూయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూత నిలిస్తే మామిడి దిగుబడి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు.
ఆశాజనకంగా మామిడి, జీడిమామిడి దిగుబడి
గతేడాది వాతావరణం అనుకూలించకపోవడం.. పొగమంచు, అకాల వర్షాల కారణంగా పూత నిలబడలేదు. ఈసారి పూత నిలబడటమే కాకుండా.. పలుచోట్ల పిందె స్థాయికి పంట చేరుకుంది. ఇదేరీతిలో వాతావరణం అనుకూలిస్తే.. దిగుబడి ఆశాజనకంగా ఉండనుంది. గతేడాది కంటే రెట్టింపు దిగుబడి వచ్చే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ఎకరానికి కేవలం ఒకటిన్నర టన్ను మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ సారి 3 టన్నుల వరకూ వస్తుందని ఉద్యానవన శాఖ అధికారుల అంచనా. అయితే.. తేనెమంచు(బంక తెగులు) పురుగు, నల్లిపురుగు, బూడిద తెగులు ఆశించకుండా జాగ్రత్తలు పాటిస్తే.. మరింత దిగుబడి రావచ్చని అధికారులు చెబుతున్నారు. జీడిమామిడిలో కూడా అద్భుతంగా పూత ఉందనీ.. దీని దిగుబడి గతేడాది కంటే పెరిగే సూచనలున్నాయని చెప్తున్నారు. గతేడాది ఎకరానికి 150 కిలోల దిగుబడి మాత్రమే ఉందనీ.. ఈసారి 250 కిలోలకు పైగా వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు.
కొమ్మల నిండా మామిడి పూత
పిందెగా మారే సమయంలో జాగ్రత్తలు
ప్రస్తుతానికి మామిడి, జీడిమామిడి పూత, పిందె దశలో అద్భుతంగా ఉన్నాయి. పూత పిందె కింద మారుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ నీరు పెట్టకూడదు. నీరు పెడితే పిందె రాలిపోతుంది. నిమ్మకాయ సైజు వరకూ పెరిగిన తర్వాత మాత్రమే నీరు పెట్టాలి. పెస్ట్ మేనేజ్‌మెంట్‌లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో లీటరు నీటిలో ఇమిడా క్లోరోపిడ్ 0.5 మి.లీ. 3 గ్రాముల బ్‌లైటాక్స్‌తో కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ నెలాఖరులో లీటరు నీటిలో 2 మి.లీ. లామ్‌డా 10ఈసీ, 3 మి.లీ. కాంటాఫ్ కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. పూత, పిందె నిలబడి దిగుబడి బాగా వస్తుంది. మరో నెలరోజులు వాతావరణం ఇదే తరహాలో అనుకూలంగా ఉంటే మామిడి తోటల రైతులు లాభాల బాట పడతారు. బయ్యర్ సెల్లర్ మీటింగ్ మే నెలలో నిర్వహిస్తాం. – కె.సత్యనారాయణరెడ్డి,
జిల్లా ఉద్యాన అధికారి
దిల్ మ్యాంగో మోర్.!
దిల్ మ్యాంగో మోర్.!
Comments
Please login to add a commentAdd a comment