రోస్టర్ సరిచేసి గ్రూప్–2 నిర్వహించాలి
ఎంవీపీ కాలనీ: ఏపీపీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్ రోస్టర్ తప్పిదాలు సవరించాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలంటూ ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్ ఎదుట మూడో రోజు శుక్రవారం కూడా అభ్యర్థులు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ గతంలో ఏపీపీఎస్సీ 904 ఖాళీలతో గ్రూప్–2 నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండగా రోస్టర్‌లో దాదాపు 50 శాతం వరకు పోస్టులు కేటాయించినట్లు తెలిపారు. దీనిపై కోర్టులో వాదనలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇటీవల కోర్టు మెయిన్స్ పరీక్ష వాయిదా వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఈ ఆదివారం మెయిన్స్ జరగాల్సివున్న నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు వెలిగించి నిరసన తెలిపారు. ఏయూలో చదువున్నవారితోపాటు, వివిధ ప్రాంతాల్లో ఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చేరుకుని నిరసనకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు నిరసన ఆపేదిలేదన్నారు. పలువురు అభ్యర్థులతో కూడిన మరో బృందం విశాఖలోని ప్రజాప్రతినిధులను కలిసి, పరీక్ష వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరుతూ వినతిపత్రాలు అందించింది. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
3వ రోజూ కొనసాగిన గ్రూప్–2 అభ్యర్థుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment