షాకే..!
● తిష్ట వేసిన టెస్టర్లు..
ముట్టుకుంటే
ఈపీడీసీఎల్‌లో వారంతా సాధారణ ఉద్యోగులే. అయినప్పటికీ కార్పొరేట్ కార్యాలయాన్నే శాసిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఒకే చోట పాతుకుపోయారు. వారి ఆగడాలు శృతి మించుతుండటంతో, అక్కడి నుంచి బదిలీ చేయాలని ప్రయత్నించిన అధికారులకే ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు వచ్చి చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఎగిరిపోయారు. కానీ వారు మాత్రం లోకల్ అంటూ అక్కడే తిష్ట వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, బదిలీ చేసిన మూడు రోజుల్లోనే తిరిగి పాత గూటికి చేరుకున్నారంటే.. వారి రూటే సెప‘రేటు’అని అర్థం చేసుకోవచ్చు. ఎంఆర్టీ డివిజన్‌లో టెస్టర్లుగా విధులు నిర్వహిస్తున్నా.. సీజీఎంల కంటే పవర్ ఫుల్‌గా వ్యవస్థను మేనేజ్ చేస్తున్న ఘనులు కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
– సాక్షి, విశాఖపట్నం
ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కొందరు ఉద్యోగులకు మాత్రమే కొమ్ముకాస్తున్న వ్యవస్థగా మారిపోయింది. రాజకీయ మద్దతు, ఉన్నతాధికారుల అండదండలు ఉంటే దశాబ్దాలుగా ఒకే చోట కాలు కదపకుండా పాతుకుపోవచ్చు. ఇందుకు గోపాలపట్నంలోని ఎంఆర్‌టీ డివిజన్ ఉద్యోగులే నిదర్శనం. ఆ డివిజన్‌లోని మీటర్స్ సెక్షన్‌లో ఐదుగురు ఉద్యోగులు దశాబ్దాలుగా ఈపీడీసీఎల్‌ను ఏలుతున్నారు. ఎల్‌టీ మీటర్ సెక్షన్‌లో జేఎల్‌ఎం నుంచి ఫోర్‌మన్ గ్రేడ్–2గా అక్కడే ఎదిగిన ఒక ఉద్యోగి ఏకంగా 32 ఏళ్ల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక హెచ్‌టీ సెక్షన్‌లో టెస్టర్ గ్రేడ్–1, 2 విభాగాలకు చెందిన ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు 29 ఏళ్లుగా, మరొకరు 25 ఏళ్లుగా, ఇంకొకరు 23 ఏళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్నారు. సిటీ మీటర్ సెక్షన్‌లో టెస్టర్ గ్రేడ్–1 ఉద్యోగి 21 ఏళ్లుగా ఆ విభాగాన్ని ఏలుతున్నారంటే.. ఈపీడీసీఎల్‌లో వీరి పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు
బదిలీ అయినా..
మళ్లీ అక్కడికే.!
ఒక్కొక్క ఉద్యోగి 20 నుంచి 30 సంవత్సరాలకు పైగా ఒకే చోట తిష్ట వేసుకొని కూర్చోవడంతో... విధుల పట్ల వారు నిర్లక్ష్యం వహించినా ప్రశ్నించేవారు కరువయ్యారు. జూనియర్లుగా విధుల్లోకి వస్తున్న వారిపైనే విధుల భారం మొత్తం మోపుతున్నారు. వీరు చెప్పినట్టు వినకపోతే, జూనియర్లకు బదిలీ వేటు తప్పదు. అల్లూరి లేదా శ్రీకాకుళం జిల్లాలకు బదిలీ చేయించేస్తారు. తమ సెక్షన్ పరిధిలో ఎవరికై నా బదిలీ కావాలంటే, ఈ ఉద్యోగుల సిఫారసు తప్పనిసరిగా మారింది. ఈపీడీసీఎల్ ఎంఆర్టీ డివిజన్‌లో ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలో వీరి కనుసన్నల్లోనే ఉన్నతాధికారులు చేస్తుంటారని విమర్శలూ ఉన్నాయి. వీరి ఆగడాలు భరించలేక.. ఏఈలు, డీఈలు ఎవరైనా సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. ఆ అధికారులకే ఎదురుదెబ్బ తగులుతుంది. ఫిర్యాదులు చేసిన వారందరూ గోపాలపట్నం కార్యాలయం నుంచి బదిలీ అయిపోయారే తప్ప.. వీరిని మాత్రం కదిలించలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇటీవల జరిగిన బదిలీల్లో ఏడాది కాలం పనిచేసిన ఉద్యోగులను సైతం ఈపీడీసీఎల్ అధికారులు బదిలీ చేశారు. కానీ, ఈ ఉద్యోగుల జోలికి మాత్రం పోలేదు. ఈ వ్యవహారంపై కొందరు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో హడావుడిగా ఈ ఐదుగురినీ అనకాపల్లి, విజయనగరం, అల్లూరి జిల్లాలకు బదిలీ చేశారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గోపాలపట్నం కార్యాలయానికి తిరిగి వచ్చేయడం గమనార్హం. గతంలో ఒకటి రెండుసార్లు బదిలీ చేసినా, నెల రోజుల్లోనే తిరిగి గోపాలపట్నంలో ప్రత్యక్షమయ్యారు.
షాకే..!
Comments
Please login to add a commentAdd a comment