ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అంశంలో వివాదం ఏర్పడింది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ ఓటు నమోదుకు అవకాశం కల్పించలేదని ఆరోపణలు రాగా.. ప్రిన్సిపాల్ ఆ ఆరోపణలను తిరస్కరించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో గురువారం గాజువాకకు చెందిన ఆర్‌టీఐ ఫోరం కన్వీనర్ కృష్ణకుమార్‌కు డీపీఎస్‌కు చెందిన కొంత మంది ఫోన్ చేశారు. 60 మంది ఉపాధ్యాయులకు ఓట్లు లేవని, ప్రిన్సిపాల్ వల్లే వారు ఓటు హక్కు కోల్పోయారని ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఏఆర్వో, డీఆర్వో భవానీ ప్రసాద్, డీఈవో ప్రేమ్‌కుమార్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దీనిపై డీఈవో స్పందించి, గాజువాక ఎంఈవోను విచారణకు ఆదేశించారు. ఆయన పాఠశాలకు చేరుకుని విచారించారు. గత ఎన్నికల వలె ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓటు నమోదు చేయిస్తారనే ఉద్దేశంతో.. తాము ఓటు నమోదు చేయించుకోలేదని అక్కడి ఉపాధ్యాయులు తెలిపినట్లు ఎంఈవో వెల్లడించారు. దీనిపై ప్రిన్సిపల్‌తో మాట్లాడగా, వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులు అర్హులైన ఉపాధ్యాయులకు అందజేశామన్నారు. తాము ఎవరినీ అడ్డుకోలేదని చెప్పారు. ఫోరం కన్వీనర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఓటు నమోదును అడ్డుకున్న ప్రిన్సిపాల్‌పై జేసీకి ఫిర్యాదు చేశానని, విచారించి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment