
సీఎం, కేంద్ర మంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట : జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గురువారం గీతం యూనివర్సిటీలో జరిగే పుస్తక ఆవిష్కరణలో పాల్గొంటారని.. శాంతి భద్రతలు, సెక్యూరిటీ పరమైన అంశాల్లో పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాల న్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, వారు ప్రయాణించే మార్గంలోని రోడ్లపై బ్యానర్లు, విద్యుత్ తీగలు, పోస్టర్లు తొలగించాలని జీవీఎంసీ, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద స్వాగతం, వీడ్కోలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. డీసీపీ అజిత, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవో పి.శ్రీలేఖ, డిప్యూటీ కలెక్టర్ సత్తిబాబు పాల్గొన్నారు. ముందుగా గీతంలో పర్యటన ఏర్పాట్లను ఎంపీ ఎం.శ్రీభరత్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్వయంగా పరిశీలించారు.
సీఎం పర్యటన ఇలా..: సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ నుంచి గీతం వర్సిటీకి గురువారం ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ జరిగే పుస్తక ఆవిష్కరణలో భాగస్వామ్యమవుతారు. అనంతరం అక్కడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీ బయలుదేరుతారు.
సమన్వయ కమిటీ సమావేశంలో
కలెక్టర్ హరేందిర ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment