
నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
ముగ్గురు విద్యార్థినులపై చర్యలు
జగదాంబ: డీడీఆర్ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇందుకు కారణమైన విద్యార్థినులపై ప్రిన్సిపాల్ దయాకర్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. వన్‌టౌన్ షాదీఖానా వెనుక ఈ కళాశాల ఉంది. ఈ కళాశాలలో మూడేళ్ల కోర్సుకు సంబంధించి 80 మంది విద్యార్థినులు నగరంతో పాటు చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చి అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది చేరిన 18 మంది విద్యార్థినులను చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. దీంతో వారందరూ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థినులను ప్రిన్సిపాల్ పిలిచి మందిలించారు. ‘మీరు హాస్టల్‌లో ఉండకూడదు. ఇంటి వద్ద నుంచే డేస్కాలర్‌గా కళాశాలకు రావాలి’అని చెప్పడంతో ఆ విద్యార్థినులు హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ దయాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. ‘విద్యార్థినులు ర్యాగింగ్ చేయడంతో మందలించి ఇంటికి పంపించిన మాట వాస్తవమే’ అని అన్నారు. వారు స్థానికులు కావడంతో హాస్టల్‌లో ఉండకూడదని హెచ్చరించామని, దీనిపై వస్తున్న వదంతులు అవాస్తమని చెప్పారు. ఈ విషయం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తెలియజేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment