ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
మహారాణిపేట: శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉగాది వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆదివారం ఉగాది వేడుకలను సిరిపురం వీఎంఆర్‌డీఎ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. దేవదాయ శాఖ, సింహాచలం దేవస్థానం అధికారులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో భవానీ శంకర్, విశాఖ, భీమిలి ఆర్డీవో శ్రీ లేఖ, సంగీత్ మహాదూర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.