
కేజీహెచ్‌లో రెండు పూటలా సూపర్ స్పెషాలిటీ ఓపీ సేవలు
మహారాణిపేట: కేజీహెచ్‌లో కొత్తగా రెండు పూటలా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ విభాగాల సేవలను రోగులు వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివానంద పేర్కొన్నారు. ఆదివారం ఆసుపత్రిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు వారానికి మూడు రోజులు నిర్వహించే ఓపీ సేవలు.. ఈనెల 5వ తేదీ నుంచి ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఓసీ సేవలు అందుతాయన్నారు. కేజీహెచ్‌లోని అన్ని విభాగాలను కంప్యూటరీకరణ చేస్తున్నామన్నారు. వార్డుల్లో టాయిలెట్స్‌ను ఎప్పుటి కప్పుడు శుభ్రం చేసి రోగులు వారి బంధువులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, సాధారణ రోగులకు వారానికి సరిపడే మందులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడ మందులు ఇస్తున్నట్లు చెప్పారు. మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.7.5 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వాసవిలత, ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ మోహర్ కుమార్ పాల్గొన్నారు.
సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద