జక్కువ నుంచి బయలుదేరుతూ మిత్రులుతీసుకున్న సెల్ఫీ
విజయనగరం క్రైమ్/గంట్యాడ: స్థానిక కేఎల్ పురం వద్ద మంగళవారం రాత్రి టిప్పర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఇదే ప్రమాదంలో మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భోగిన సత్యనారాయణ (32)కు మగపిల్లాడు పుట్టాడు. బాబుకు బారసాల చేసేందుకు సామగ్రి కొనుగోలు కోసం సత్యనారాయణ, మిత్రులు జక్కువ గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి రాజు (25), బొడ్డు గౌరీశంకర్‌లు మంగళవారం సాయంత్రం విజయనగరం వచ్చారు.
సామగ్రి కొనుగోలు చేసిన అనంతరం విజయనగరంలో భోజనం చేసి, తర్వాత వారి స్వగ్రామాలకు ద్విచక్రవాహనంపై ముగ్గురూ వెళ్తుండగా ఆర్టీఓ కార్యాలయం నుంచి విజయనగరం వైపు వస్తున్న టిప్పర్ వారి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటనస్థలంలోనే లచ్చిరెడ్డి రాజు మృతిచెందగా మిగిలిన ఇద్దరిని స్థానికులు 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సత్యనారాయణ మృతిచెందాడు. గౌరీశంకర్‌ను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై గోపాల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
జక్కువ, కొంపంగి గ్రామాల్లో విషాదఛాయులు
మెంటాడ మండలంలోని జక్కువ, కొంపంగి గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయా గ్రామాలకు చెందిన యువకులు జిల్లా కేంద్రంలో దుర్మరణం చెందడంతో మృతుల కుటుంబసభ్యుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది. చేతికి అందివచ్చిన కుమారులు రహదారి ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న కుటుంబసభ్యులు లబోదిబోమంటుంటే చూపరుల గుండె బరువెక్కింది.
బాబుపుట్టిన 16రోజులకే..
బొగిన.సత్యనారాయణ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య భవాని గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామ సచివాలయంలో మహిళాపోలీస్‌గా విధులు నిర్వహిస్తోంది. వారికి వివాహమై ఏడాది అయింది. సెప్టెంబర్ 4వతేదీన ఆ దంపతులకు బాబు పుట్టాడు.
లచ్చిరెడ్డి రాజు నేపథ్యం..
లచ్చిరెడ్డిరాజు తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లే అన్నీ తానై పెంచింది. అన్నయ్య సీతారాం, వదిన జానకితో కలిసి రాజు ఉంటున్నాడు. రాజు మరుపల్లి గ్రామంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కుటుంబానికి సహాయంగా ఉంటున్న రాజు రోడ్డు ప్రమాదంలో మృతిచెండంతో అన్నావదినల రోదన వర్ణనాతీతంగా ఉంది.
సెల్ఫీ హల్‌చల్
గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి బైక్‌పై వెళ్తున్నామని అందరికీ బైబై అంటూ లచ్చిరెడ్డి రాజు వాట్సాప్‌లో పెట్టిన ఫొటో జక్కువ గ్రామ యువతను విషాదంలో ముంచేసింది. బైబై అని పెట్టిన స్టేటస్ అదే మిత్రుడి చివరి స్టేటస్ అవుతుందని ఊహించలేదంటూ మిత్రులందరూ కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment