బైక్ దొంగ అరెస్ట్
గుర్ల: ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో మండలానికి చెందిన సున్నపు ఉదయ్‌కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్సై నారాయణరావు ఆదివారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్లెపేటకు చెందిన బూర్లె పెంటం నాయుడు తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని నిలిపివేశాడు. అక్కడకు రెండు గంటల తర్వాత వాహనం కనిపించకపోడంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా వాహనం కనిపించకపోవడంతో గుర్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై నారాయణరావు సిబ్బందితో కలిసి వెంటనే నేర చరిత్ర ఉన్న మండలానికి చెందిన సున్నపు ఉదయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బైక్ దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడ్ని చీపురుపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
ద్విచక్రవాహనం అపహరణపై కేసు నమోదు..
సంతకవిటి: మండల పరిధి పొనుగుటివలస గ్రామంలో ద్విచక్ర వాహనం దొంగతనంపై కేసు నమోదు చేశామని ఎస్సై ఆర్.గోపాలరావు ఆదివారం తెలిపారు. తన ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని గ్రామానికి చెందిన రెడ్డి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కుంకి ఏనుగులు ఎప్పుడొస్తాయి..?
పార్వతీపురం టౌన్: ఏనుగుల సమస్య పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన కుంకి ఏనుగులు ఎప్పుడొస్తాయని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్‌చార్జ్ బత్తిన మోహనరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏనుగుల భారిన పడి ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, సుమారు రూ. 6 కోట్ల మేర ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమన్నారు. కుంకి ఏనుగులు రప్పించి ఏనుగుల సమస్య పరిష్కరిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటలు ఏమయ్యాయన్నారు. 2017లో పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రవేశించిన ఏనుగులు ఇప్పటివరకు 12 మందిని పొట్టను పెట్టుకోవడం విచారకరమన్నారు. అలాగే ఏనుగులు కూడా ఏడు మృతి చెందాయని చెప్పారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏనుగుల సమస్య పెద్దదేమీ కాదని.. పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని ఆరోపించారు. ఏనుగుల బారిన పడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వంగల దాలినాయుడు, కోలా కిరణ్, శిరసపల్లి సాయి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎన్నికలకు ఏర్పాట్లు
● 27న జరిగే ఎన్నికలకు సిబ్బంది నియామకం
● 18న తొలి విడత శిక్షణ తరగతులు
● 25 వేల బ్యాలెట్ పత్రాల తయారీ
మహారాణిపేట: ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సారథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది అభ్యర్థులు తుది ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల పేరుతో తెలుగులో బ్యాలెట్ పత్రం రూపొందించి, ప్రింటింగ్ కోసం కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు.
అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం
అభ్యర్థులు నామినేషన్‌లో పేర్కొన్న మేరకు తొలి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం నమూనాను తయారు చేశారు. తుది జాబితా మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా మరో పది శాతం కలిపి సుమారు 25 వేల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఇవి ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల తేదీకి రెండు రోజులు ముందు వాటిని బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.
18 నుంచి తొలి విడత శిక్షణ
ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 18 నుంచి సిబ్బందికి, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ 24న ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి(పీవో)తోపాటు ముగ్గురు సిబ్బంది అవసరం. మొత్తం 492 మంది సిబ్బందితోపాటు అదనంగా మరో పది శాతం మందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment