కన్న కొడుకే కాలయముడు..
విజయనగరం క్రైమ్: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గాజులరేగలో జరిగిన హత్య కేసు మిస్టరీని విజయనగరం టూటౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీ రాత్రి తన భర్త సూరిబాబు మృతి చెందాడని అతని భార్య సృజన ఫిర్యాదు చేసిందన్నారు. వెంటనే ఎస్సై మురళి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. విచారణ నిమిత్తం భార్య, స్థానికులతో మాట్లాడగా మృతుడి కుమారుడిపై అనుమానం ఏర్పడిందన్నారు. వెంటనే అతడ్ని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా.. తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవన్నారు. తండ్రి అడ్డు తొలగిస్తే ఇల్లు తనకు దక్కుతుందని భావించి నిందితుడు (పోలీసులు పేరు వెల్లడించలేదు) ఈనెల 12న తండ్రితో గొడవపడి గుండెలపై పిడి గుద్దులు గుద్దడంతో పాటు కర్రతో బలంగా బాదడం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడని చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
తండ్రిని హత్య చేసిన కొడుకు అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment