తప్పని డోలీ మోతలు..
శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో ఉన్న తమకు డోలీ మోతలు తప్పడం లేదని.. ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు మాట మరిచారని గిరిజన సంఘ నాయకులు ధ్వజమెత్తారు. మూలబొడ్డవర పంచాయతీ పరిధిలో గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడుకు చెందిన జన్ని రవి అనే యువకుడు ఆదివారం కడుపునొప్పి, విషజ్వరంతో బాధపడడంతో బంధువులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఒక కర్రకు తట్టకట్టి రవిని అందులో కూర్చోబెట్టి, గ్రామానికి చెందిన యువకులు సుమారు ఏడు కిలోమీటర్లు కొండల మధ్యగా డోలీని మోసుకుంటూ మైదాన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనం దొరక్కపోవడంతో తెలిసిన వారి బైక్‌పై కూర్చోబెట్టి హుటాహుటిన ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సంఘ నేతలు, గ్రామ యువకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వేళ ఎస్.కోట బహిరంగ సభలో మాట్లాడుతూ, చిట్టంపాడుకు చెందిన గంగులు భార్య, అతడి బిడ్డ వైద్యం అందక చనిపోయారని.. ఇది చాలా అవమానమని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా తమ కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిశిఖర గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం చేయకతప్పదని గిరిజన సంఘ నాయకులు జరతా గౌరీష్, తదితరులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment