సంచారం ఓ చదరంగం..!
● పశు ఆరోగ్యసేవలపై ప్రభుత్వం కుట్ర.. ● సేవలు నిలిపివేయాలని ఆదేశాలు ● నిలిచిపోయిన మొదటి విడత ప్రారంభమైన ఏడు వాహనాలు ● ఒక్కో వాహనంలో ముగ్గురు సిబ్బంది ● ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్స్ జారీ ● ఉన్న పళంగా తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు
విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పి స్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్‌అసిస్టెంట్స్, వెలుగులో పని చేసే వీఓఏలు, కేజీబీవీల్లో పనిచేసే కుక్‌లు, వాచ్‌మె న్, పాఠశాలల్లో పనిచేసే వాచ్‌మెన్, ఆయాలను తొలగించారు. తాజాగా సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేసే సిబ్బందిని తొలిగించేశారు. పేజ్–1లో నియమితులైన అందరికీ టెర్మినేషన్ ఆర్డర్స్ జారీ చేశారు. ఒక్కసారిగా తొలగింపు ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు అంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
జిల్లాలో 13 వాహనాలు
సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 13 ఉన్నాయి. మొదటి విడతలో 7 వాహనాలు వచ్చాయి. రెండో విడతలో వచ్చిన 6 వాహనాలు ఉన్నాయి. మొదటి విడతలో విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లికి వాహనాలు వచ్చాయి. రెండో విడతలో గజపతినగరం, బొబ్బిలి, ఎస్.కోట, రాజాం, నెల్లిమర్ల, చీపురుపల్లికి వాహనాలు వచ్చాయి. మొదటి విడతలో వచ్చిన ఏడు వాహనాలను ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్థకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అదేవిధంగా సిబ్బందికి టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయి.
ఒక్కో వాహనంలో ముగ్గురు సిబ్బంది పని
ఒక్కో వాహనంలో ముగ్గురు చొప్పన సిబ్బంది పనిచేసేవారు. ఒక డ్రైవర్, పారవిట్, పశువైద్యుడు పనిచేసేవారు. అదేవిధంగా 6 వాహనాలకు ఒక రిలీవర్ కూడా పనిచేశారు. అయితే ఉన్నపళంగా వారిని విధుల నుంచి తొటగించడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
పశువుల చెంతకు వెళ్లి సేవలు
మూగజీవాలు అనారోగ్యానికి గురైతే వాటి చెంతకే వెళ్లి వైద్య సేవలు అందించే విధంగా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022లో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో అనారోగ్యానికి గురైన ఎన్నో పశువులకు ఈ వాహనాల ద్వారా వైద్య సేవలు అందించారు. పశువుల చెంతకే వచ్చి వైద్యసేవలు అందించడం వల్ల పాడి రైతులు ఎంతో సంతోషించేవారు. ఈ వాహనాలు రాకముందు ఏదైనా పశువుకు అనారోగ్యం వస్తే పశు వైద్యశాలలకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. మళ్లీ పాత రోజులే వచ్చే పరిస్థితి కనిపిస్తోందని పాడి రైతులు వాపోతున్నారు.
ఈఎంఆర్‌ఐ సంస్థ నిర్వహణ
రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు ఆరోగ్య సేవను జీవీకే ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నిర్వహించేది. ఫిబ్రవరి 15, 2025తో ఆ సంస్థ టెండర్ కాలపరిమితి అయిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకుండా సేవలను నిలిపివేసింది. ఏదైనా సంస్థకు టెండర్ కాలపరిమితి అయిపోయినప్పడు కొత్తగా టెండర్లు పిలిచి నూతన సంస్థ బాధ్యతలు స్వీకరించేవరకు పాత సంస్థను కొనసాగించేవారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. కొత్త సంస్థ బాధ్యతలు తీసుకోకుండానే పాత సంస్థ సేవలను నిలిపివేశారు. అలాగే కొత్త సంస్థ పాత ఉద్యోగులను కొనసాగించకుండా టెర్మినేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలు వాస్తవమే
మొదటివిడతలో జిల్లాకు మంజూరైన ఏడు సంచార పశు ఆరోగ్య సేవల వాహనాల సేవలు నిలిపివేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. ఆదివారం నుంచి సేవలు నిలిపివేశాం. ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఉద్యోగులకు వాటిని అందజేశాం. –బి.నారాయణరావు,
జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ జిల్లా మేనేజర్
సంచారం ఓ చదరంగం..!
Comments
Please login to add a commentAdd a comment