
పేదల ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నం
● ప్రజలు ప్రతిఘటించడంతో వెనుదిరిగిన అధికారులు
సాలూరు: రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు నివాసముంటున్న ఇళ్లను కోర్టు ఆదేశాలతో కూలగొట్టేందుకు అధికారులు జేసీబీతో రాగా, తమ గూడును తొలగించవద్దంటూ పేదలు వాపోయి ఆందోళన చేసి ప్రతిఘటించారు. సాలూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీలోని 29వ వార్డులో ఉన్న రైల్వేస్టేషన్ రోడ్డులో పేదలు నివాసముంటున్న పూరిళ్లను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సోమవారం పూనుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న పేదల ఇళ్లను కూల్చేందుకు యత్నించారు. వెంటనే బాధిత ప్రజలు తమ ఇళ్లను కూల్చవద్దంటూ గగ్గోలు పెట్టారు. పట్టణ పౌరసంక్షేమ సంఘం కార్యదర్శి ఎన్‌వై నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు శ్రీనువాసరావు సదరు బాధిత పేదలకు అండగా నిలిచారు. పేదలతో కలిసి నాయకులు సంఘటనాస్థలానికి అధికారులు, పోలీసులతో తీసుకువచ్చిన జేసీబీని అడ్డుకున్నారు. నిరుపయోగంగా ఉన్న కొన్ని పూరిళ్లను తొలగించారు. ఈ సందర్భంగా పేదలు కమిషనర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసి 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న చోటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో పేదలు ఊపిరిపీల్చుకున్నారు.

పేదల ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నం
Comments
Please login to add a commentAdd a comment