అంగన్‌వాడీలకు రూ.26వేలు వేతనం చెల్లించాలి
విజయనగరం గంటస్తంభం: అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణంలోని ఎన్‌పీకే ఆర్ శ్రామిక్ భవన్‌లో స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి విశాలాక్షి అధ్యక్షతన సోమవారం సాయంత్రం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు గతం కంటే అదనంగా కేటాయించిన రూ.150 కోట్లను లెక్కకడితే పిల్లాడికి 5 పైసలు వస్తుందన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు ఆ నిధులు సరిపోవన్నారు. విద్య, వైద్య రంగాలకు, ఉపాధి హామీ పథకానికి అరకొరగా నిధులు కేటాయించి గొప్పగా చెప్పుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెట్టిందని, అందులో భాగమే 4 లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తున్నారని మండిపడ్డారు. కోటి మందికి పైగా ఉన్న స్కీమ్ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించడానికి మోదీ అంగీకరించడం లేదని, 8 గంటల పనిదినాన్ని 12 గంటలుగా మార్పు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వీస్‌లో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. 20వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు తగినంత కేటాయింపులు చేయాలని, అంగన్‌వాడీల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహనరావు, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పైడిరాజు, మంగవేణి, తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ యూనియన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ
అంగన్‌వాడీలకు రూ.26వేలు వేతనం చెల్లించాలి
Comments
Please login to add a commentAdd a comment