రైతులకు ఆదాయం పెంచే సూచనలివ్వండి
విజయనగరం ఫోర్ట్: రైతులకు ఆదాయం పెంచేలా సూచనలు, సలహాలు అందించాలని ఆచార్య ఎన్.జి.రంగా సహాయ విస్తరణ సంచాలకులు బి.ముకుందరావు సూచించారు. గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరకు సాగు విస్తీర్ణం పెంచి బెల్లం తయారీకి రైతులను ప్రోత్సహించాలన్నారు. మొక్కజొన్నలో కాండం తొలుచుపురుగు ఉద్ధృతి పెరుగుతోందని, నివారణ చర్యలను రైతులకు వివరించాలన్నారు. అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలను అందించాలని సూచించారు. రెల్లరాల్చు పురుగు వల్ల రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగువిధానాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు సీహెచ్ ముకుందరావు, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, పశు సంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ కెల్ల లక్ష్మణ్, ఎం.వి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment