అపరాలకు దక్కని మద్దతు..! | - | Sakshi
Sakshi News home page

అపరాలకు దక్కని మద్దతు..!

Published Wed, Feb 19 2025 1:08 AM | Last Updated on Wed, Feb 19 2025 1:08 AM

అపరాల

అపరాలకు దక్కని మద్దతు..!

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం

ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి

ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

తుఫాన్ల కారణంగా వేల హెక్టార్లలో

పంటకు నష్టం

విజయనగరం ఫోర్ట్‌: ఖరీఫ్‌లో పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్‌ వల్ల వరి పంటతో పాటు అపరాల (పెసర, మినుము) పంటలు కూడా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో పెసర, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఉన్న పంటకు కూడా ప్రస్తుతం మద్దతు ధర రాని పరిస్థితి. మార్కెట్‌లో రైతులు పండించిన పంటకు మద్దతు ధర రానప్పడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పిస్తూ పంటను కొనుగోలు చేయాలి. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని కూటమి సర్కార్‌ చెప్పింది. కానీ ఇంతవరకు ఇచ్చిన పాసాన పోలేదు. తాజాగా అపరాలు సాగు చేసిన రైతులు మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. తాము పండించిన పెసర, మినుము చాలా వరకు పంట తీసి నూర్పులు చేసి పంట వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో పంటను తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

21,931 హెక్టార్లలో అపరాలు సాగు

జిల్లాలో అపరాలు 21 931 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో పెసర పంట 5,909 హెక్టార్లలోను, మినుము పంట 16,011 హెక్టార్లలో సాగైంది. వీటి ద్వారా పెసర పంట 3,520 మెట్రిక్‌ టన్నులు, మినుము పంట 10,081 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

పెసర ఎంఎస్‌పీ రూ.8682

పెసర పంట ఎంఎస్‌పీ క్వింటారూ. 8682, మినుములు ఎంఎస్‌పీ క్వింటాకు రూ.7400 అయితే ప్రభుత్వం అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అపరాలు విక్రయించాల్సిన పరిస్థితి. పెసలు క్వింటాకు రూ.7 వేలు, మినుములు క్వింటాకు రూ.6500 చొప్పున ప్రైవేట్‌ వ్యాపారులు కొంటున్నారు. దీని వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం

జిల్లాలో సాగైన అపరాల్లో తుఫాన్‌ వల్ల చాలా వరకు పంట దెబ్బతింది. ఎకరాకి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఎకరాకి క్వింటా కూడా దిగుబడి రాని పరిస్థితి. ఉన్న పంటను అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా వరకు రైతులు పంట తీసేశారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏకారణం చేతనో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొనుగోలు కేంద్రాలు మార్క్‌ఫెడ్‌ ఏర్పాటు చేయాలి

అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెఫెడ్‌ డీఎంకు లెటర్‌ రాశాం. కొనుగోలు కేంద్రాలు మార్క్‌ఫెడ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. వి.తారకరామారావు,

జిల్లా వ్యవసాయ అధికారి

ఎం.డి.కి ప్రతిపాదనలు పంపిస్తాం

జిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాసిన లెటర్‌ అందింది. జేసీ ద్వారా మార్కెఫెడ్‌ ఎం.డి.కి అపరాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తాం. అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

ఎన్‌.వెంకటేశ్వరావు,

మార్కెఫెడ్‌ , జిల్లా మేనేజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
అపరాలకు దక్కని మద్దతు..!1
1/1

అపరాలకు దక్కని మద్దతు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement