
ఆ ముగ్గురి మధ్యే పోటీ!
పాకలపాటి రఘువర్మ
● కీలక దశకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు
● ఈనెల 25 సాయంత్రం 4 గంటలతో ముగియనున్న ప్రచారం
● ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక
● మొత్తం ఓటర్లు: 22,493 మంది ● పోలింగ్ కేంద్రాలు: 123
డాక్టర్ గాదె
శ్రీనివాసుల
నాయుడు
సాక్షి ప్రతినిధి,విజయనగరం:
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు అన్ని ప్రాంతాలను చుట్టుముడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం తాము మద్దతిచ్చే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నాయి. గతం కంటే ఈసారి ఓటర్లు పెరిగారు. పోటీ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. పోటీ చేసిన వారికి మొత్తం పోలైన ఓట్లలో కనీసం 50 శాతం ఓట్లు రావాలి. లేకుంటే 2వ ప్రాధాన్యత ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మద్దతు ఇవ్వని వారిని కూడా పోటీలో ఉన్నవారు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
● పోటీ వారిమధ్యనే..
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి, పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు, ఏపీటీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. విజయగౌరికి ఉత్తరాంధ్రాలో బలమైన యూటీఎఫ్ సంఘాలు మద్దతు ఇస్తుండగా, రఘువర్మకు టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు మద్దతు ప్రకటించారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకు బీజేపీ నాయకులు, మాజీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీ మాధవ్ మద్దతు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు వీరి ముగ్గురి మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
● ప్రచారానికి కొద్దిరోజులే సమయం..
గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభ్యర్థులు జోరుగా చేపడుతున్నారు. ఈ ప్రచారం ఈ నెల 25న సాయంత్రం 4 గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రచారంలో స్పీడు పెంచాయి. పాఠశాలల్లో వివిధ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు ఉండడంతో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.
● 123 కేంద్రాల్లో పోలింగ్..
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్వతీపురం మన్యం, విజయగనరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ఉన్న 22,493 మంది ఓటర్ల కోసం 123 పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేశారు. ఈ కేంద్రాల్లో 22,493 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 8,985 మంది, పురుషులు 13,508 మంది ఉన్నారు. శ్రీకాకుళం–5,035 మంది, విజయనగరం–5,223, పార్వతీపురం మన్యం–2,333, అల్లూరి సీతారామరాజు–1,488, విశాఖపట్నం–5,529, అనకాపల్లి జిల్లాలో 2,885 మంది ఓటర్లు నమోదై ఉన్నారు.
ఆ ఇద్దరు కూడా...
ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్యే సాగుతుందన్న రాజకీయ విశ్లేషకులు చెబుతుండంగా... శ్రీకాకుళం జిల్లాకు చెందిన బహుజన సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థి పోతల దుర్గారావు కూడా ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రైవేటు పాఠశాలల నుంచి పోటీ చేస్తున్న సుంకర శ్రీనివాసరావు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుండడంతో మొదట ప్రాధాన్యత ఓటు శాతం ప్రధాన అభ్యర్థులకు తగ్గే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కీలకం కానున్నారు.
పోటీ అభ్యర్థులకు మద్దతు ఇలా...
గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి పీఆర్‌టీయూ తరఫున బరిలో దిగిన డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడుకు ఏపీటీఎఫ్ (1938), ఆంధ్రపదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాల టీచర్ల సంఘం (ఆప్టా), బహుజన ఉపాధ్యాయ సంఘం, ఆర్‌యూపీపీ, ఆదివాసీ ఉపాధ్యాయ, ఎస్టీయూ సంఘాల (ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు) మద్దతు ఉంది.
తొలిసారిగా బరిలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థిని కోరెడ్ల విజయగౌరికి యూటీఎఫ్, ఏపీ మోడల్ స్కూల్ పీఎస్, కేజీబీవీ టీచర్లు, తదితర సంఘాలు మద్దతు తెలిపాయి.
రెండో సారి పోటీలో ఉన్న పాకలపాటి రఘువర్మకు ఏపీటీఎఫ్ (257), ఎస్‌ఎల్‌టీఏ, ప్రధానోపాధ్యాయుల సంఘం, పీఆర్‌టీయూడీ, ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు అండగా ఉన్నాయి.

ఆ ముగ్గురి మధ్యే పోటీ!

ఆ ముగ్గురి మధ్యే పోటీ!

ఆ ముగ్గురి మధ్యే పోటీ!
Comments
Please login to add a commentAdd a comment