ఎన్నికల విధుల్లో అప్రమత్తం
విజయనగరం అర్బన్: ఎన్నికల విధుల నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పీఓలు, ఏపీఓలు, జోనల్ అధికారులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన మొదటివిడత శిక్షణలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులను ఎన్నిసార్లు నిర్వహించినా ఏ మాత్రం అలసత్వం చూపించకూడదన్నారు. ఎప్పటికప్పుడు నిబంధనలు మారుతూ ఉంటాయని, కొత్త ఆదేశాలు వస్తుంటాయని, వాటన్నింటినీ చదవి అర్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని, సొంత నిర్ణయాలు పనికిరావని స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాలు, ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలకు మధ్య కొన్ని తేడాలు ఉంటాయని, వీటిని ప్రతిఒక్కరూ గ్రహించాలని సూచించారు. డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి ఎన్నికల సిబ్బంది లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.బాలాజీ ఎన్నికల శిక్షణ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ, పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత చేయాల్సిన విధులను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఆర్డీఓ డి.కీర్తి ఇతర అంశాలను వివరించారు.
జిల్లా ఎన్నికల అధికారి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment