సీతంపేట: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో విద్యార్థులకు పోషకాహారం ఎండమావిగా మారుతోంది. కొద్ది రోజుల కిందట అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెనూలో భాగంగా పోషకాహరం అందివ్వడానికి పెట్టే కోడిగుడ్లు నిలుపుదల చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఆదేశించారు. పక్క ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల విద్యార్థులకు ఎగ్స్ పెడుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం నిలిపివేయడం గమనార్హం. అలాగే మిడ్‌డేమీల్, అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో చిన్నారులకు కోడిగుడ్లు ఇస్తున్నప్పటికీ ఆశ్రమపాఠశాలలకు మాత్రమే నిలుపుదల చేయడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మిగతా ఐటీడీఏలలో ఎక్కడా కోడిగుడ్లు నిలుపుదల చేయలేదని స్థానిక గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మాత్రమే ఆపివేశారని వాపోతున్నారు. సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో 47 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నెలకు ఐటీడీఏ పరిధిలో అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలకు కలిపి మొత్తం 3,70,000 కోడిగుడ్లు అవసరం. ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు (శనివారం మినహాయించి )ఇచ్చేవారు. చికెన్, కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినవచ్చని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం చేస్తోంది. చికెన్ ఎలాగూ బర్డ్‌ఫ్లూ భయంతో నిలుపుదల చేశారు. కనీసం ఎగ్ కూడా పెట్టకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఏమన్నారంటే..
ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర వద్ద సాక్షి ప్రస్తావించగా తుని నుంచి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని, బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి దృష్ట్యా కొద్ది రోజులు నిలిపివేయాలని అన్ని వసతిగృహాలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
అంతకు ముందు చికెన్ నిలిపివేత
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment