ఉపాధికల్పనలో అలసత్వం..!
విజయనగరం ఫోర్ట్:
ఉత్తుత్తి హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... అన్నింటా వైఫల్యం చెందుతోందన్న మాట ప్రతిఒక్కరి నోటా వినిపిస్తోంది. ఓ వైపు ప్రజాసంక్షేమ పథకాలు ఎండమావిగా మారాయి. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. పల్లెల్లోని చిన్న, సన్నకారు రైతులు, కూలీలకు ‘ఉపాధి’ చూపడంలోనూ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది.
పనికి ఆసక్తిచూపే వారందరికీ కాకుండా కొంతమందికే ఉపాధి పనులు కల్పించడంపై వేతనదారులు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కల్పనలోనూ వివక్ష చూపడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 25 లక్షల పనుల కల్పనలో వెనుకబడి ఉండడంపై ప్రశ్నిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎక్కువ మంది వేతనదారులకు పనికల్పించారు. దీని వల్ల వేతనదారుల జీవోనపాధికి ఇబ్బంది ఉండేది కాదు. పని కోసం వలస వెళ్లాల్సిన అవసరం తప్పేది. పనుల కల్పనలో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేదని గుర్తుచేస్తున్నారు.
2023–24లో ఫిబ్రవరి 19 నాటికి 1.78 కోట్ల పనిదినాల కల్పన
2024–25లో 1.53 కోట్ల
పనిదినాలే..
గతేడాది కంటే ఈ ఏడాది 25 లక్షల పనిదినాలు తక్కువ
ఆవేదనలో వేతనదారులు
పని కల్పనకు చర్యలు
పని అడిగిన వేతనదారుడికి పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మార్చి నెలఖారు నాటికి పని దినాల లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తాం. వ్యవసాయ పనులు ముగిసినందున పనుల్లో పాల్గొనే వేతనదారుల సంఖ్య పెరుగుతోంది.
– ఎస్.శారదా దేవి, డ్వామా పీడీ
జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6.05 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీనాటికి 1.78 కోట్ల పనిదినాలు కల్పించారు. 2024–25లో ఫిబ్రవరి 19వ తేదీ నాటికి 1.53 కోట్ల పని దినాలే కల్పించారు. గతేడాది కంటే ఇదే సమయానికి 25 లక్షల పనిదినాలు తక్కువగా కల్పించారు. ఉపాధిహామీ పథకం కింద నీటి వాగులు, కుంటలు, చెరువుల ఆధునికీకరణ, పొలాల చుట్టూ సరిహద్దు కందకాలు, పంట కుంటలు, ఊట కుంటలు వంటి పనులు గ్రామ సభల ఆమోదం మేరకు జరపాలి. కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో వెండర్ విధానానికి తెరతీయడంతో వేతనదారులకు పనిలేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పథక నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబులు నింపే పనులకే ఖర్చుచేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపాధికల్పనలో అలసత్వం..!
Comments
Please login to add a commentAdd a comment