బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లిమర్ల: మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీఏపీ) బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల్లో మొత్తం 440 మంది విద్యార్థులకు ఐదోతరగతిలో ప్రవేశాలు కల్పించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. నెల్లిమర్ల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో 140 సీట్లు కేటాయించారు. వాటిలో ఎంపీసీ–60, బైపీసీ–40, సీఈసీ–40 సీట్లు ఉన్నాయి. వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు
గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరంతరంగా (202–24, 2024–25) చదివి ఉండాలి. బీసీ, ఈబీసీ విద్యార్థులు 01.09.2014 –31.08.2015 మధ్య జన్మించి, 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2013–31.08.2017 మధ్య జన్మించి, 9 నుంచి 13 సంవత్సరాల వయసు వారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల సంవత్సర ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించరాదు.
జిల్లాలో మూడు బాలికలు, నాలుగు బాలుర ఎంజేపీఏపీ బీసీ గురుకులాలు
440 మంది విద్యార్థులకు
ఐదోతరగతిలో ప్రవేశాలకు అవకాశం
నెల్లిమర్లలో ఇంటర్‌లో ప్రవేశానికి
140 సీట్లు
వచ్చేనెల 15 వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల స్వీకరణ
ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి/సంరక్షకుని మొబైల్ నంబర్ తదితర ప్రాథమిక వివరాలతో రూ.100 చెల్లిస్తే జర్నల్ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా హెచ్‌టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పంపిన తరువాత వచ్చే రిఫరెన్స్ నంబరుతో దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకోవాలి. పాఠశాలలకు నేరుగా అందజేసే దరఖాస్తు పరిగణనలోకి తీసుకోరు.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
జిల్లాలోని ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలు పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశాం. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతికి, పదోతరగతి విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశానికి మార్చి 15వ తేదీ లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – కేబీబీ రావు,
గురుకులాల జిల్లా కన్వీనర్, విజయనగరం
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment