ఆరుబయట స్నానం..నేలపైనే నిద్ర!
ఆరుబయట తాటిపూడి పైప్‌లైన్ నుంచి వచ్చిన నీటితో స్నానాలు చేస్తున్న విద్యార్థులు
సరిగా భోజనం పెట్టడం లేదు
హాస్టల్‌లో సక్రమంగా భోజనం పెట్టడం లేదు. తరచూ అస్వస్థతకు గురవుతు న్నాం. అందుకే తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచే మమ్మలను స్కూల్‌కు వెళ్లమంటున్నారు. నైట్ వాచ్‌మన్ రోజూ మా స్కూల్ వద్దకు వచ్చి మాతో బయోమెట్రిక్‌ను వేయించుకుంటున్నారు.
– జి.యోగేంద్ర, 7వ తరగతి, జి.రాంజీ 8వ తరగతి, ఏపీ మూడల్ స్కూల్
ఎవరూ పట్టించుకోలేదు
మెనూ బాగోలేదని హాస్టల్‌కు వచ్చిన ప్రతీ అధికారికి చెబుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. 7 నెలల నుంచి పాలు ఇవ్వడం లేదు. పండ్లూ లేవు. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలి.
– కె.తరుణ్, వి.రామచైతన్య
నీరులేక ఇబ్బందులు పడుతున్నాం
హాస్టల్‌లోని వాటర్‌ట్యాంక్ పగిలిపోయింది. నాటి నుంచి స్నానాలకు నీళ్లు లేవు. తాటిపూడి పైప్‌లైన్ నుంచి నీరు వచ్చిన సమయంలోనే స్నానం చేయాలి. కాస్త ఆలస్యమైనా ఆ పూట స్నానం లేనట్లే. మంచాలు కూడా లేవు. కిందనే పడుకుంటున్నాం. మా వార్డెన్ పగటిపూట హాస్టల్‌కు రావడం లేదు.
– పి.వెంకట్రాది, జె.మోక్షత్‌సాయి
లక్కవరపుకోట:
వారందరూ పేదకుటుంబాలకు చెందిన పిల్లలు. తమ భవితను బంగారుమయం చేసుకోవాలని తలచారు. ఎల్.కోట సాంఘిక సంక్షేమ వసతిగృహంలో చేరి స్థానికంగా ఉన్న ఏపీ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారిని సమస్యలు చుట్టుముట్టాయి. వసతి గృహంలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. చదువుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. వార్డెన్ పర్యవేక్షణ లేదు. ఆయన హాస్టల్‌కు ఎప్పుడు వస్తారో తెలియదు. మెనూ చార్టు గోడలకే పరిమితమవుతోంది. కంచంలో భోజనం చూసి చిన్నారులు ఆందోళన చేయని రోజు లేదు. హాస్టల్‌కు వచ్చే ప్రతి అధికారికి గోడు వినిపిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నది వారి వాదన. 50 విద్యార్థుల్లో కొందరు సమస్యల నడుమే చదువులు సాగిస్తుండగా.. సుమారు 20 మంది వారి ఇళ్ల నుంచే పాఠశాలలకు వెళ్తున్నారు. వీరి భోజనం బిల్లు కాజేసేందుకు వార్డెన్ సూచనలతో వాచ్‌మన్ ప్రతిరోజూ పాఠశాలల వద్ద కాపుకాసి బయోమెట్రిక్ నమోదుచేస్తుండడం గమనార్హం.
● అమలుకాని మెనూ..
వసతిగృహంలో మెనూ సరిగా అమలుకావడంలేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు పాలు ఇవ్వాల్సి ఉన్నా గత 7 నెలల నుంచి అమలుకావడం లేదు. స్నాక్స్ పరిస్థితీ అంతే. వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్డు భోజనం పెడుతున్నారు. గుడ్లు సైతం ఉడికీ ఉడకనివి పెడుతున్నారని చిన్నారులు వాపోతున్నారు.
● కానరాని సదుపాయాలు...
హాస్టల్‌లో ఐదు నెలల కిందట స్లాబ్‌పైన గల నీటి ట్యాంక్ పగిలిపోయింది. అంతే.. నీటికి తిప్పలు తప్పడం లేదని చిన్నారులు వాపోతున్నారు. తాటిపూడి నుంచి వచ్చిన నీటితో ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులకు సరిపడా మంచాలు లేకపోవడంతో కటిక నేలపైనే నిద్రిస్తున్నారు. హాస్టల్‌లో అన్నీ వాచమన్ చూస్తున్నారని, రాత్రిపూట మాత్రమే వార్డెన్ వచ్చి వెళ్తారని చిన్నారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వార్డెన్ కొల్లు గౌరినాయుడును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి బి.రామానందం వద్ద హాస్టల్ దుస్థితిని ప్రస్తావించగా ఇది వరకే హాస్టల్‌లో పిల్లల ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయన్నారు. బుధ వారం హాస్టల్‌ను పరిశీలించి మెనూ సక్రమంగా అమలయ్యేలా చూస్తానని, విద్యార్థులకు సౌక ర్యాలు మెరుగు పరుస్తామని తెలిపారు.
ఆరుబయట స్నానం..నేలపైనే నిద్ర!
ఆరుబయట స్నానం..నేలపైనే నిద్ర!
ఆరుబయట స్నానం..నేలపైనే నిద్ర!
ఆరుబయట స్నానం..నేలపైనే నిద్ర!
Comments
Please login to add a commentAdd a comment