
నిరసన హోరు
అంగన్‌వాడీ ఉద్యోగులు.. ఆటో డ్రైవర్లు.. రైతులు.. విశ్వహిందూపరిషత్ ప్రతినిధుల ఆందోళనలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ అంగన్‌వాడీలు నినదించారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మోసపూరిత గ్రాట్యుటీ ప్రకటనపై నిరసన తెలిపారు. ప్రైవేటు ఫిట్‌నెస్ సెంటర్ ఎత్తేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.15000 అందజేయాలని ఆటోడ్రైవర్లు ధర్నా చేశారు. హిందువులపై దాడులను అరికట్టాలని విశ్వహిందూపరిషత్ ప్రతినిధులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అన్యాయం చేయద్దంటూ రైతులు ఆందోళన చేశారు. కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రాలు అందజేశారు.
ఫిట్‌నెస్ కేంద్రాన్ని ఎత్తేయాలి
విజయనగరం జిల్లా గుర్ల మండలం అచ్చుతాపురం వద్ద వేదాంత మల్టీ నేషనల్ కంపెనీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రైవేటు ఫిట్‌నెస్ (బ్రేక్) సెంటర్‌ను తక్షణమే ఎత్తివేయాలని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంపై ఆటోడ్రైవర్లతో కలిసి అచ్చుతాపురంతోపాటు, కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఫిట్‌నెస్, రెన్యు వల్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ వంటివి ఆర్డీఓ కార్యాలయంలోనే జరగాల న్నారు. బ్రేక్ చేయాలంటే రూ.3 వేల నుంచి రూ.4వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబాన్ని పోషించే బతుకుబండి ఫొటోలను పోలీసులతో తీయించి ఫైన్‌లు వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఎన్నికల హామీ మేరకు తక్షణమే రూ.15000 ప్రతి డ్రైవర్ ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కె.సురేష్, పాపారావు, రామునాయుడు, సత్యంకృష్ణ, అప్పలరాజు రెడ్డి, నారాయణరావు, దాలినాయుడు
తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం గంటస్తంభం/గుర్ల
Comments
Please login to add a commentAdd a comment