పోక్సోకేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్: పోక్సో కేసులో ఓ నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి కె.నాగమణి తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకుల్‌జిందల్ తెలిపారు. కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 27 ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు అనకాపల్లికి చెందిన ఓ కుటుంబం తమ మూడున్నరేళ్ల పాపతో హాజరయ్యారు. గంట్యాడ మండలం కొటారుబిల్లికి చెందిన విసినిగిరి రవి (31) బాలికను సమీపంలోని టింబర్ డిపో పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై అదే రోజు విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ఎన్.పద్మావతి పోక్సో కేసు నమోదుచేశారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అభియోగపత్రం కోర్టులో దాఖలు చేసి సాక్షులను సకాలంలో హాజరుపర్చింది. నేరం రుజువుకావడంతో శిక్ష పడింది. కేసులో చురుగ్గా పనిచేసిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
మరుపల్లిలో సిరిమాను సంబరం
గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లారమ్మ తల్లి సిరిమానోత్సవం సంబరంగా సాగింది. ఆలయ ప్రధాన పూజారి రుద్రాక్షల సత్యనారాయణ రూపంలో తిరువీధుల్లోకి వచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఎల్లారమ్మా.. కాపాడాలమ్మా అంటూ ప్రార్థించారు. తల్లి ఆశీస్సులు అందుకున్నారు. సర్పంచ్ లెంక రామలక్ష్మి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో సాగిన ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
– గజపతినగరం రూరల్
మాకొద్దీ మద్యం షాపు
సంతకవిటి మండలం వాసుదేవపట్నం పంచాయతీ పరిధిలోని పోతులజగ్గుపేట గ్రామంలో మద్యం షాపు ఏర్పాటును మహిళలు సోమవారం అడ్డుకున్నారు. గీత కార్మికుల ప్రత్యేక రిజర్వేషన్ కోటాలో ఎస్.కోట మండలానికి చెందిన జి.పావని సంతకవిటి మండలంలో వైన్‌షాప్‌ను దక్కించుకున్నారు. దీనిని పోతులజగ్గుపేటలో ఏర్పాటుకు పూనుకోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. మా గ్రామంలో మద్యం చిచ్చుపెట్టొద్దంటూ నినదించారు. సాయంత్రం వరకు దుకాణం వద్దనే బైఠాయించారు. ‘బాబూ’.. మా గ్రామంలోని 250 మంది ప్రశాంతంగా జీవిస్తున్నారని, మద్యం దుకాణం ఏర్పాటుచేసి కుటుంబాలను చిందరవందర చేయొద్దన్నారు. సర్పంచ్, గ్రామస్తుల సమ్మతిలేకుండా దుకాణం ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధమని, అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు.
– సంతకవిటి
పోక్సోకేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment