
ధారపర్తిని దగా చేసిందెవరు..?
శృంగవరపుకోట: అభంశుభం తెలియని గిరిజన తల్లుల గర్భశోకం..ఎవరి పాపం. తీవ్రమైన జ్వరాలు, వంటిపై దద్దుర్లుతో ఆస్పత్రి పాలైన చిన్నారుల తల్లుల శోకానికి, పాపానికి కారణం ఎవరన్న విషయమై వైద్యాధికారులు ఇంతవరకూ చెప్పలేదు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ గిరిశిఖర గ్రామాల్లోని చిన్నారులు ఇటీవల తీవ్రజ్వరం, దద్దుర్లుతో ప్రాణాపాయ స్థితిలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని చక్కదిద్దినా, డబ్ల్యూహెచ్‌ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు చెనగపాడు గ్రామంలో పర్యటించి ఇచ్చిన రిపోర్టుతో తీగలాగితే డొంక కదిలినట్లు, వైద్యసిబ్బంది కట్టు కథ బయటికొచ్చింది. పిల్లల్లో తట్టు, పొంగు వ్యాధుల నివారణకు ఇచ్చే ఎంఆర్ వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వక పోవడం వల్లనే జ్వరాలు, దద్దుర్లు వచ్చాయని, ఇవి తట్టు లక్షణాలేనన్న నిజం బయటకు వచ్చింది. దీంతో గత వారం రోజులుగా వైద్యారోగ్యశాఖ అధికారులు, క్షేత్రసిబ్బంది కొండపైకి పరుగులు తీస్తూ, ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంసీపీ కార్డులు మాయం చేసి, ఎంఆర్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కనిపించిన వారందరికీ వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ఇంతవరకూ వైరాలజీ ల్యాబ్ రిపోర్టులు ఏం చెప్పాయో తేల్చలేదు. దారపర్తి ఘటనపై విచారణకు ఆదేశించలేదు. దారపర్తిలో జ్వరాలకు కారకులైన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇంతవరకూ 18మంది చిన్నారులు జ్వరం, దద్దుర్లతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14మంది చిన్నారుల శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. కాగా శాంపిల్ రిపోర్టులు బయట పెట్టలేదు. మరో 12మంది చిన్నారులు జ్వరాలు తదితర సమస్యలతో చికిత్స తీసుకున్నారు.
చర్యల కోసం డిమాండ్
పిల్లలకు వ్యాక్సిన్ వేయకుండా వారి ప్రాణాలతో చెలగాటం అడుతున్న క్షేత్రస్థాయి వైద్యసిబ్బందిపై కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. అంతరించిందనుకున్న తట్టు వ్యాధి వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో తిరిగి పురుడు పోసుకోవడం ప్రభుత్వానికే సిగ్గు చేటని మండిపడ్డారు. గతంలో చిన్నారులు చనిపోతే కనీస విచారణ లేకుండా జిల్లా అధికారులు చేతులు తుడిచేసుకున్నారని ధ్వజమెత్తారు. వైద్యాధికారులు వదిలేసినా, తాము ఈ విషయాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారుల నుంచి ఫీల్డ్‌స్టాఫ్ వరకూ అందరూ భాగస్వాములేనని మండిపడ్డారు.
ల్యాబ్ రిపోర్టులు ఎక్కడ..?
బాధ్యులపై చర్యలకు గిరిజన సంఘం డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment