
ఆశలు ఆవిరి
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
శాసనసభకు వెళ్లడానికి వీలుగా టికెట్ ఇవ్వనప్పుడు కనీసం శాసనమండలికై నా వెళ్లి ‘అధ్యక్షా...’ అనడానికి అవకాశం వస్తుందని ఆశించిన స్థానిక టీడీపీ నాయకులకు నిరాశే ఎదురైంది. ఎప్పటివలే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన మోసపూరిత మార్కురాజకీయం చూపించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను ఊరించి ఉసూరుమనిపించినట్టే .. పార్టీ నాయకులను ఎన్నికల్లో వాడుకుని ఇప్పుడు వదిలేశారు. దీనిపై ఆ పార్టీ నాయకుల అనుచరగణం భగ్గుమంటోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ ఆశ చూపించి అన్యాయం చేశారని మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకునే అవకాశం వచ్చింది. దీంతో తమకు అవకాశం వస్తుందని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలువురు టీడీపీ స్థానిక నాయకులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో ఏ కోటాలో ఎమ్మెల్సీలను పంపడానికి అవకాశం వచ్చినా ఉత్తరాంధ్రకు పెద్దపీట వేసేవారు. అలా.. విజయనగరం జిల్లా నుంచి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు శాసనమండలిలో అడుగుపెట్టడానికి అవకాశం వచ్చింది. సురేష్‌బాబుకై తే రెండోసారి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కింది. అలాగే చంద్రబాబు కూడా తమకు అవకాశం ఇవ్వకపోతారా? అని ఆశించిన ఉభయ జిల్లాల నాయకులకు ఆశాభంగమైంది. ఒక అవకాశం ఇవ్వకపోతారా అని అధిష్టానం వద్ద విశ్వ ప్రయత్నాలు చేసినా తుదకు ఆశావహుల జాబితాలోనూ వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.
ఊరించి.. ఉసూరుమనిపించి...
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని కర్రోతు బంగార్రాజు, గొంప కృష్ణ, కిమిడి నాగార్జున, బొబ్బిలి చిరంజీవులు, ఆర్‌పీ భంజ్‌దేవ్, తెంటు లక్ష్మునాయుడు, కేఏ నాయుడు, కావలి గ్రీష్మ... ఇలా పలువురు నాయకులు తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకున్నారు. టికెట్ ఇవ్వకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ టీడీపీ అభ్యర్థులకు దెబ్బ కొడతారోనని ఊహించిన చంద్రబాబు... వారందర్నీ ‘ఎమ్మెల్సీ’ ఆశల పల్లకి ఎక్కించారు. వారంతా మనసు మార్చుకొని పార్టీలో తమ పోటీదారులకు మద్దతు పలికారు. ఎలాగో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారంతా అధిష్టానం తమకు ఇచ్చిన హామీ నెరవేర్చుతుందని ఆశించారు.
నామినేటెడ్ పదవులతో సరి...
ఎమ్మెల్యే అవదామనుకున్న కర్రోతు బంగార్రాజు తనకు కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడంతో మిన్నకుండక తప్పలేదు. ఆర్‌పీ భంజ్‌దేవ్, తెంటు లక్ష్మునాయుడు, కావలి గ్రీష్మలతో పాటు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అలా వారు కూడా ఎమ్మెల్సీ సీటు ఆశించకుండా నీళ్లు చల్లేశారు. ఇక మిగిలింది గొంప కృష్ణ, కిమిడి నాగార్జున, బొబ్బిలి చిరంజీవులతో పాటు మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు. తమకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదంటే ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం వద్ద విశ్వప్రయత్నాలు చేసినా చివరకు వారి పేర్లు పరిశీలనలోకై నా తీసుకోలేదని తెలిసి మౌనంగా ఉండిపోయారు.
‘కొల్ల’కై తే ఇప్పటికీ నిరాశే...
టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చిందంటే ఎమ్మెల్సీ పదవి ఎంతవరకూ వస్తుందో టీడీపీ సీనియర్ నాయకుడు కొల్ల అప్పలనాయుడే ఓ ఉదాహరణ. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన ఆయన గతంలో ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండు దఫాలు తన అనుచరులను ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జిల్లాపరిషత్ చైర్మన్‌ను చేస్తానని ఆశ చూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపించారు. చౌదరి బాబ్జీ భార్య చౌదరి ధనలక్ష్మికి చంద్రబాబు ఆ పదవి కట్టబెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించడానికి చంద్రబాబు ఎమ్మెల్సీ అస్త్రం ఉపయోగించారు. 2017 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు టీడీపీ టికెట్ తనకు ఇస్తారని ఆశించిన కొల్లకు చంద్రబాబు మళ్లీ జెల్లకొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజుకు ఆ టికెట్ ఇచ్చేశారు. దీంతో రెబెల్‌గా బరిలోకి దిగేందుకు కొల్ల అప్పలనాయుడు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ ఆయనను బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కొల్లను కనీసం పట్టించుకోలేదు. అలా ఆయన ‘ఎమ్మెల్సీ’ ఆశ ఇప్పటికీ నెరవేర లేదు. అదీ చంద్రబాబు మార్క్ రాజకీయం.
అధ్యక్షా.. అనాలనుకున్న టీడీపీ
నాయకుల ఆశలపై నీళ్లు
ఉమ్మడి విజయనగరం నుంచి ఏ
ఒక్కరికీ దక్కని ఎమ్మెల్సీ సీటు
సార్వత్రిక ఎన్నికల్లో రెబెల్స్‌కు
చంద్రబాబు గట్టి హామీ
అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవిపై స్థానిక నాయకుల ఆశలు
ఐదు ఖాళీల్లో అవకాశమిస్తారని
అధిష్టానం వద్ద ప్రయత్నాలు
కనీసం పరిశీలన జాబితాలోనూ పేరు లేకపోవడంతో నిరాశ!
Comments
Please login to add a commentAdd a comment