మార్చి 12లోగా వ్యవసాయ పరికరాలకోసం దరఖాస్తు
పార్వతీపురం: వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి గాను రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను సరఫరా చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.2.47కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్‌లు, ఫుట్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్‌లు, ట్రాక్టర్ దుక్కు, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్‌లు, పవర్ టిల్లర్లను అందించనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీ ద్వారా పరికరాలు పొందని ఎస్సీ,ఎస్టీ, సన్న, చిన్నకారు మహిళా రైతులు అర్హులన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములను సాగుచేస్తున్న రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఏఐడీసీ) రైతులతో చర్చించి పరికరాల ధరలను నిర్ణయించి లబ్ధిదారులకు అందించనున్నామని చెప్పారు. ఆసక్తిగల రైతులు వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment