77 జీఓ రద్దుకు డిమాండ్
విజయనగరం గంటస్తంభం: జీవో నంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూడి రామ్మోహన్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగరం డిగ్రీ కళాశాల విద్యార్థులు మయూరి కూడలి నుంచి కాంప్లెక్స్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుచేసి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విస్మరిస్తోందన్నారు. తక్షణమే రూ.3,680 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్మి డి.రాము, సీహెచ్. వెంకటేష్‌లు మాట్లాడుతూ ఉపకార వేతనాలు విడుదల కాక జిల్లాలో డిగ్రీ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల్లో హాల్‌టికెట్స్ ఇచ్చే పరిస్థితి లేదని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్మించారు. గతంలో డిగ్రీ రిలీవ్ అయిన విద్యార్థులు వేల సంఖ్యలో పీజీ జాయిన్ అయ్యేవారని, జీవో నంబర్ 77 మూలంగా ఉపకార వేతనాలు రాక డిగ్రీ తర్వాత చదువు ఆపేస్తున్నారన్నారు. వెటర్నరీ విద్యార్థులకు స్టైఫండ్‌ను రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఈనెల 15న విజయవాడలో తలపెట్టిన నిరసన దీక్షను జయపద్రం చేయాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జె.రవికుమార్, జగదీష్, రమేష్, జిల్లా సహాయ కార్యదర్మి శిరీషా, రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment