రాజాం: జిల్లాలో 91,836 మంది 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) కింద సేవలు పొందారని పథకం జిల్లా మేనేజర్ దూబ రాంబాబు తెలిపారు. ఆయన రాజాం సామాజిక ఆస్పత్రిని బుధవారం పరిశీలించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న మెనూను లబ్ధిదారులకు అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో మాట్లాడారు. ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.హరిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద రూ.195 కోట్ల విలువైన వైద్యసేవలు అందించినట్టు వెల్లడించారు.
డీసీసీబీలో అంతర్గత ఆడిటర్ల నియామకం
విజయనగరం అర్బన్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని 24 బ్రాంచిలలో అంతర్గత ఆడిటర్లను నియమించుకునేందుకు మహాజన సభలో ఆమోదం తెలిపారు. జేసీ ఎస్.సేతుమాధవన్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మూడో మహా జన సభలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి బ్యాంకు ఆర్థిక ఫలితాలపై చర్చించారు. గత నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. 2025–26 ఆర్థిక వార్షిక బడ్జెట్ అంచనాలను సమావేశం కన్వీనర్, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు సభ్యులకు వివరించారు. కస్టమర్ డిపాటిట్ పాలసీ, కస్టమర్ సర్వీస్ పాలసీ, డెత్ క్లెయిమ్ పాలసీలపై చర్చించారు. సమావేశంలో నాబార్డు డీడీఎం టి.నాగార్జున, విజయనగరం డీసీఓ సన్యాసినాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా డీసీఓ శ్రీరామ్మూర్తి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
మృత శిశువుతో ఆందోళన
శృంగవరపుకోట: శిశువు మృతికి వైద్యులే కారణమంటూ మృత శిశువుతో తల్లి, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఎస్.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన అరుణ్ భార్య శాంతి ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఉదయం 10 గంటల సమయంలో ఆపరేషన్ కోసం ఆస్పత్రి థియేటర్‌లోకి గర్భిణిని తీసుకెళ్లారు. అప్పటివరకు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన వైద్యులు కొద్ది సేపటికి మాట మార్చి శిశువు మృతిచెందినట్టు చెప్పారు. దీనిపై అరుణ్‌తో పాటు బంధువులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఆడ శిశువు చనిపోయిందంటూ శాంతితో పాటు బంధువులు, మృత శిశువుతో కలిసి ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. బిడ్డ మృతికి వైద్యులే కారణమంటూ ఆందోళన చేశారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నీల స్పందిస్తూ ప్రైవేట్‌స్కాన్ సెంటర్‌లో చేయించిన స్కాన్ రిపోర్టులో బిడ్డ హార్ట్‌బీట్ బాగుంది. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించాం. ప్రసవం అవుతున్నప్పుడు బిడ్డ మెడకు రెండు ప్రేగులు చుట్టుకున్నట్టు వైద్యులు చూశారు. బిడ్డ బయటకు వస్తున్న కొద్దీ ప్రేగులు మెడకు బిగిసుకోవడంతో ఊపిరి ఆడక శిశువు మరణించింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని చెప్పారు.
91,836 మందికి ఆరోగ్యశ్రీ సేవలు
91,836 మందికి ఆరోగ్యశ్రీ సేవలు