
రామతీర్థానికి శ్రీరామనవమి శోభ
● వైభవంగా ప్రారంభమైన కల్యాణ వసంతోత్సవాలు ● వేద రుత్విక్కులచే శాస్త్రోక్తంగా పారాయణాలు ● ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీ ర్థం శ్రీ రామస్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున స్వామికి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోనికి స్వామివారిని వేచింపజేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, రుత్విగ్వరణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 40 మంది ఋత్విక్కులచే ఈ నెల 6వ తేదీ వరకు శ్రీమద్రామాయణ, సుందరకాండ, సహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించనున్నారు.
వేద రుత్విక్కులచే పారాయణాలు
స్వామివారి ఆస్థాన మండపం వద్ద వివిధ ప్రాంతా ల నుంచి విచ్చేసిన రుత్విక్కులచే శ్రీమద్రామయణం, సుందరకాండ పారాయణాలు, సుదర్శన శతకం, నాలాయర దివ్య ప్రబంధ, తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం యాగశాలలో సుందరాకాండ, గాయత్రీ రామాయణాలు, సుదర్శన శతకం హోమాలను నిర్వహించి అగ్నిప్రతిష్టాపనను గావించారు. రాత్రి 7గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పర్వదినం మొదలుకొని శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజు ల పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఋత్విక్కులచే శత సహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.