పందుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఆత్మకూర్‌లో పందుల దొంగతనానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్‌లోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట సమీపంలో చెన్నయ్య షెడ్ వేసుకొని 73 పందులను పెంచుతున్నారు. ఫిబ్రవరి 16న బింగిదొడ్డి అంజి, మాదిరె మహేష్, నందవరం బాలరాజు రెక్కి నిర్వహించి పందులు ఉన్నట్లు ఎరుకలి భీమన్న, కందేనతి సుంకన్నకు సమాచారం ఇచ్చారు. 17వ తేదీన అందరూ కలిసి ఎరుకలి సిద్ధప్ప బొలెరో వాహనంలో సింధనూర్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో ఎరుకలి అంజి, ఎరుకలి నాగరాజును ఎక్కించుకొని ఎమ్మిగనూర్‌కు వచ్చి అక్కడ ఎరుకలి భీమన్న, గుల్లి నాగరాజు, కందెనతి సుంకన్న, మదిరె మహేశ్, హోలిగుంది అంజి కలిసి అదేరోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో 30 పందులను వాహనంలో ఎక్కించారు. కాపలాగా ఉన్న ఇద్దరు లేచి అరుస్తూ దగ్గరగా వస్తుండగా వారిపై గాజు సీసాలు, రాళ్లతో దాడిచేయగా గాయాలయ్యాయి. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కొని మార్గమధ్యంలో జూరాల జలాశయంలో పడేసి వెళ్లి బెంగుళూరులో రూ.90 వేలకు విక్రయించారు.
ఇలా దొరికారు..
మంగళవారం ఉదయం సిద్ధప్ప తన బొలెరో వాహనంలో హోలిగుంది అంజి, సిరిగెరి నాగరాజు, బింగిదొడ్డి అంజి కలిసి దొంగతనం చేయడానికి అమరచింత వైపు వస్తున్నారు. మస్తీపూర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా గమనించి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే గతంలో వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్ల, పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, గద్వాల జిల్లాలోని అలంపూర్, శాంతినగర్, అయిజ, కర్నూల్ జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూర్, నందవరం, మాధవరం, కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, మస్కి, హుబ్లి, సింధనూర్ ప్రాంతాల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, రూ.90 వేల నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ, అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, ఆత్మకూరు సీఐ శివకుమార్, ఆత్మకూరు ఎస్‌ఐ నరేందర్, అమరచింత ఎస్‌ఐ సురేష్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment