‘ఎల్‌ఆర్‌ఎస్’ వేగవంతం చేయాలి
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ప్లాట్ల క్రమబద్దీకరణకు సుమారు 25 వేల మందికి నోటీసులు జారీ చేసినా.. ఆశించినస్థాయిలో ఫలితం కనిపించడం లేదని, లేఅవుట్లు చేసిన వారు, బిల్డర్లు, ప్లాట్ల యజమానులకు వార్డు అధికారులతో ఫోన్ చేయించి డబ్బులు కట్టించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పుర కమిషనర్లు, టౌన్ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లతో ఎల్‌ఆర్‌ఎస్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ ఉంటే ప్లాట్‌కు రక్షణ ఉంటుందని, ఎవరూ ఆక్రమించడానికి అవకాశం ఉండదని, పురపాలిక ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ప్లాట్ విక్రయించాలనుకున్నా ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న ప్లాట్‌కు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారి నుంచి డబ్బులు వసూలు చేసి క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిందని.. తర్వాత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం జరిమానా చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోను అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అనంతరం ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు చెల్లించిన ప్లాట్ల యజమానులకు కలెక్టర్ క్రమబద్ధీకరణ ఉత్తర్వు కాపీలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment