
సమీకృతం.. అసంపూర్ణం
కొత్త పురపాలికల్లో మూడేళ్లవుతున్నా సాగని పనులు
ఆత్మకూర్/అమరచింత/వనపర్తిటౌన్/కొత్తకోట రూరల్: పుర కేంద్రాల్లో కూరగాయలు, మాంసం విక్రయాలకుగాను అన్ని హంగులతో సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట శ్రీకారం చుట్టింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక్కో నిర్మాణానికిగాను రూ.2 కోట్లు విడుదల చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించినా నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లాలోని కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో కాంట్రాక్టర్ల అలసత్వం, నిధుల లేమితో పనులు ముందుకు సాగడం లేదు. అన్ని పురపాలికల్లో నిర్మాణాలు సగమే పూర్తయ్యాయి. అప్పట్లో వేసిన టెండర్‌కు.. ప్రస్తుతం పెరిగిన ధరలకు వ్యత్యాసం ఉండటంతో అదనపు భారం అవుతుందని పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పనులను పర్యవేక్షిస్తూ వేగం పెంచాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని చిరు వ్యాపారులు, పుర ప్రజలు కోరుతున్నారు.
పనులు పూర్తి చేయాలి..
పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు నిర్మాణం త్వరితగతిన పూర్తిచేస్తే రహదారులకు ఇరువైపులా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులకు మేలు చేకూరుతుంది. అలాగే వాహనాల రాకపోకల ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులు, వినియోగదారులకు సౌలభ్యంగా మారనున్న మార్కెట్ నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు, పాలకులు చొరవచూపాలి. – తోట రవి,
కూరగాయల వ్యాపారి, ఆత్మకూర్
జిల్లాకేంద్రంలో పూర్తయినా నిరుపయోగంగానే..
రహదారులపై కూరగాయల విక్రయం
రాకపోకలకు తప్పని అవస్థలు
త్వరగా పూర్తిచేయాలంటున్న చిరు వ్యాపారులు

సమీకృతం.. అసంపూర్ణం

సమీకృతం.. అసంపూర్ణం

సమీకృతం.. అసంపూర్ణం