
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
అమరచింత: జూరాల ఆయకట్టు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని.. చివరి తడి వరకు సాగునీరు ఇస్తామన్న హామీని ఎన్నటికీ విస్మరించమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసి మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు అధికారులు యాసంగిలో రామన్‌పాడు వరకు కేవలం 20 వేల ఎకరాలకే నీటిని అందిస్తామని ప్రకటించారని, సకాలంలో కాల్వకు సాగునీటిని విడుదల చేసినా.. రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. జూరాల ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తగ్గిందని.. కర్ణాటకలోని ప్రాజెక్టు ద్వారా 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అక్కడి ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదలశాఖ మంత్రిని కోరామని చెప్పారు. ఉమ్మడి జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరాలకే ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితరులు కలిసి కర్ణాటక ప్రభుత్వానికి సమస్యను విన్నవించడంతో జూరాలకు 4 టీఎంసీల నీటిని వదిలినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు జూరాల ఆయకట్టు రైతుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదని, నేడు రైతులను రెచ్చగొట్టి ధర్నాలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తేనే నీటిని వదులుతున్నారని అనుకోవడం తగదని.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండ్రోజుల పాటు అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలోని డి–6 కాల్వకు రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు. రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకొని పంటలు కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జూరాల ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ కార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, చుక్కా ఆశిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆయకట్టు పంటలు కాపాడేందుకే
కర్ణాటకతో చర్చలు
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం