
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పెంట్లవెల్లి: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో కొనసాగిన సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నేతలు మన దేశం కనుమరుగు కాకూడదని ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని కొందరు చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరన్నారు. బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనేత అని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ మహనీయుల కృషి ఫలితమే అన్నారు. ప్రతిఒక్కరూ మహనీయుల అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మండలంలోని జటప్రోల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్‌పర్సన్ వెన్నెల ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందుతుందా.. సకాలంలో ఇస్తున్నారా.. అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని, తేడా వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తూకాల్లో తేడాలు లేకుండా రెవెన్యూ అధికారులు చూడాలని సూచించారు. కార్యక్రమంలో గోవింద్‌గౌడ్, రామన్‌గౌడ్, భీంరెడ్డి, గోపాల్, ఖదీర్, కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.