
ధాన్యం వివరాలు తప్పక నమోదు చేయాలి
కొత్తకోట/ కొత్తకోట రూరల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం మండలంలోని పాలెం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో టెంట్, వడ్లు తూర్పు పట్టే ఫ్యాన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెంట్ వేయించాలని, తాలు తొలగించేందుకు ఫ్యాన్ పెట్టించి ఉపయోగించాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో వచ్చిన వడ్లు తేమ శాతం, నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించారు. సెంటర్ ఇన్‌చార్జ్‌ని పలు వివరాలు అడగగా.. ఆయన నీళ్లు నమలడంతో వెంటనే మార్చాల ని ఆదేశించారు. అలాగే ప్రతి సెంటర్‌లో శిక్షణ పొందిన వారిని మాత్రమే ఇన్‌చార్జ్‌గా నియమించాలన్నారు. వడ్లలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, పాడి క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని, దొడ్డు రకం, సన్న రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పట్టణంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించి.. ఏఎన్‌సీ, ఈడీడీ మందుల స్టాక్ రిజిష్టర్లను తనిఖీ చేశారు. ప్రస్తుతం ఉన్న మందులు, వాటి తుది గడువు తదితర వివరాలు తెలుసుకున్నారు. గర్భిణుల ఏఎన్‌సీ సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు.