
జూరాల.. భద్రమేనా?
జూరాల జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు
జూరాల ప్రాజెక్టు
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్‌లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.
రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు..
కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది.
జూలై నాటికి పూర్తి..
జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల కిందట రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. కానీ, 2023లో గ్యాంటీక్రేన్‌కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం గ్యాంటీక్రేన్‌ను పూర్తిస్థాయిలో రిపేరు చేశాం. శుక్రవారం నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – జుబేర్, ఈఈ, జూరాల డ్యాం
62 రేడియల్ క్రస్ట్ గేట్లు..
జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఈ 62 రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్(పైకెత్తడం) చేయడం ద్వారా నీటిని దిగువనకు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో రేడియల్ క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీల్స్, అడుగు భాగాన ఒక రబ్బర్ సీల్ ఉన్నాయి. ఆపరేట్ చేసేందుకు అవసరమైన ఇనుప రోప్‌లు గేటుకు ఇరువైపులా, కింది భాగాన రెండు చొప్పున ఇనుప రోపుల నిర్మాణం ఉంటాయి. వీటి సాయంతోనే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకి ఎత్తడం, దించడం చేస్తారు.
భారీ వరద వస్తే..
2009 సంవత్సరం మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కర్ణాటకలోని టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం, తాజాగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీ గేట్లు దెబ్బతినడం ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
18 చోట్ల రబ్బర్‌సీల్ దెబ్బతినడంతో లీకేజీలు
మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు
మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు
ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి