
ఫలించిన రైతుల ఆందోళన
జూరాల ఎడమ కాల్వకు నీటి విడుదల
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు తమకు నీరు అందడం లేదని, పంటలు వాడుముఖం పడుతున్నాయంటూ ప్రాజెక్టు రహదారిపై రెండు పర్యాయాలు చేసిన ఆందోళనకు ఫలితం దక్కింది. రైతుల ఆవేదనను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఎట్టకేలకు చివరి తడిగా రెండురోజుల పాటు నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జూరాల ఎడమ కాల్వకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అత్యధికంగా వరి సాగు చేయడంతో ఇరు మండలాల ప్రజలు సాగునీరు కావాలంటూ వారం రోజుల్లో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టారు.
మరోతడి అవసరమే..
ఆత్మకూర్ మండలంలోని తూంపల్లి, కత్తేపల్లి, ఆరేపల్లి, మెట్లంపల్లి, జూరాల గ్రామాలతో పాటు ఇతర గ్రామాల ఆయకట్టు రైతులు ఆలస్యంగా వరి సాగుచేయడంతో సమస్య జఠిలంగా మారింది. అధికారుల అంచనా ప్రకారం మార్చి చివరి వారంలోనే పంట చేతికందాల్సి ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో 15 రోజుల తర్వాతే పూర్తిస్థాయిలో వరిపంట చేతికందే పరిస్థితి ఉంది. చివరి తడిగా బుధవారం నుంచి రెండురోజుల పాటు నీటిని వదులుతుండగా.. వచ్చేవారం రెండ్రోజుల పాటు నీటిని అందిస్తే పంటలు చేతికందుతాయంటున్నారు. జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ఇదే చివరితడిగా వదులుతున్నామని, పొదుపుగా వాడుకోవాలని సూచిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎత్తిపోతల రైతులు గట్టెక్కినట్లే..
జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు చివరిసారిగా అందిస్తున్న నీటితో తమ పంటలు చేతికందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. సాగునీరు వదిలిన వెంటనే ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల, మస్తీపురం, సింగంపేట, ఖానాపురం, అమరచింత, పాంరెడ్డిపల్లిలో రైతులు వెయ్యి ఎకరాల వరి సాగుచేశారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు ప్రస్తుతం అందిస్తున్న సాగునీరు ఊపిరి పోసేలా ఉందని, పంట చేతికందుతుందనే ఆశలో ఉన్నారు.
చివరి తడిగా ప్రకటించిన అధికారులు
మరో తడి ఇవ్వాలంటున్న రైతన్నలు
రెండ్రోజుల పాటు సరఫరా..
ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు జూరాల ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సాగునీరు రెండురోజుల పాటు వదులుతున్నాం. రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించాం.
– శ్రీనివాస్‌రెడ్డి ఎస్‌ఈ, జూరాల జలాశయం

ఫలించిన రైతుల ఆందోళన