
కల్తీ కల్లుతో బేజారు
కల్లుకు బానిసై తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం
ఏడాదిన్నర కిందట కల్తీ కల్లు సేవించి మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి, కోయినగర్, దొడ్లోనిపల్లి గ్రామాలకు చెందిన 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్తీ కల్లు వినియోగిస్తూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి క్రమంగా పెరుగుతోంది.
‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లక్ష్మయ్య. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా కల్తీ కల్లు తాగుతుండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడు దెబ్బతిని నోటమాట రాని పరిస్థితికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మెంటల్ హెల్త్ విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని, తనలాంటి బాధితులు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వాపోయాడు.’