
వేసవి సెలవుల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి
వనపర్తిటౌన్: విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్లతో సమయాన్ని వృథా చేయకుండా స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, నాట్యం తదితర వాటిలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, మోటారు వెహికిల్, సైబర్ క్రైమ్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సమయాన్ని
వృథా చేయొద్దు : ఎస్పీ
వనపర్తి: యువత తమ విలువైన సమయాన్ని వృథా చేయకుండా కఠోర సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కేడీఆర్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 1967లో మొదటి సరస్వతి శిశుమందిరం నిర్మల్‌లో ప్రారంభమైందన్నారు. ఎస్‌ఎల్‌ఎన్ ఆచార్యులు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పాఠశాల ప్రారంభించగా.. పుర ప్రముఖులు, సంఘపెద్దలు పునాదిరాళ్లు వేశారని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థికి ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యం ఉండాలని.. ఒడిదుడుకులు అధిగమించి ముందుకుసాగితే అనుకున్నది సాధించగలమన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని.. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండి తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య వక్త, వందేమాతరం ఫౌండేషన్ స్థాపకుడు రవీంద్ర, వనపర్తి సీఐ కృష్ణ, చైతన్యగౌడ్, కార్యదర్శి అరవింద్ ప్రకాష్, పాలమూరు విభాగ్ సహ కార్యదర్శి రాజమల్లేశ్, నాగిరెడ్డి, సూర్యనారాయణ, వనపర్తి జిల్లా విద్యా శాఖ ఏఎంఓ మహానంది, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్, యుగేంధర్, శరత్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ అబ్జర్వర్ల నియామకం
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ అబ్జర్వర్ల జాబితాను ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు దొమ్మటి సాంబయ్య, గజ్జి భాస్కర్ యాదవ్, నాగర్‌కర్నూల్‌కు టి.బెల్లయ్య నాయక్, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, వనపర్తికి ఎ.సంజీవ్ యాదవ్, గౌరి సతీశ్, జోగుళాంబ గద్వాలకు దీపక్ జైన్, బి.వెంకటేశ్ ముదిరాజ్, నారాయణపేటకు ఎం.వేణుగౌడ్, బొజ్జ సంధ్యారెడ్డి పార్టీ అబ్జర్వర్లుగా కొనసాగనున్నారు. వీరు పార్టీ తరఫున ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేయనున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరును అధిష్టానానికి నివేదించనున్నారు.
నిబంధనలు పాటించాలి
గోపాల్‌పేట: లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రాజెక్టు డైరెక్టర్ పర్వతాలు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణానికి ఎంత మేర సిమెంట్, కంకర, స్టీల్ వినియోగిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లోపించకుండా చూడాలని ఎంపీడీఓ శంకర్‌నాయక్‌ను ఆదేశించారు. మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

వేసవి సెలవుల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి