వనపర్తిటౌన్: వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోతుందని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 62 రోజుల పాటు పకడ్బందీగా ఇంటింటి సర్వేతో సమగ్ర వివరాలతో ప్రజామోదానికి అనుగుణంగా అడుగులు వేసిందని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ ప్రచార లోపంతో వెనుకబడి ఉన్నామని అంగీకరించారు. బీసీ బిల్లుకు చొరవ తీసుకున్న కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మాని ప్రజా అభ్యున్నతికి విలువైన సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావాలని హితవు పలికారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ నేత కోళ్ల వెంకటేష్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగ జాతి మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తోందని, వర్గీకరణ పోరులో ఎందరో అమరులయ్యారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించేందుకు ప్రతి ఊరిలో మాదిగలు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నారాయణ, గోర్ల జానకిరాములు, నాయక్ తదితరులు పాల్గొన్నారు.