వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 6,844 మంది విద్యార్థులకు గాను 6,830 మంది హాజరు కాగా.. 14 మంది గైర్హాజరైనట్లు డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. కాగా, పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోగా.. సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
దెబ్బతిన్న పంటల
పరిశీలన
వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: ఇటీవల కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులతో పంటలు నష్టపోయిన రైతులను గుర్తించేందుకు సోమవారం వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వనపర్తి మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల, కొత్తకోట మండలం కానాయపల్లి, సంకిరెడ్డిపల్లి, రాయిణిపేట గ్రామాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీంద్రనాయక్, ఏడీఏ దామోదర్ పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటనష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల్లో దాదాపు 58 ఎకరాల్లో వరిపంట దెబ్బతిందని.. కొత్తకోట మండలంలోని మూడు గ్రామాల్లో దాదాపు 330 ఎకరాల్లో వరిపంట, 18 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. పంటనష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. వారి వెంట ఏఓ కుర్మయ్య, ఏఈఓ కవిత, మాజీ సర్పంచ్ కొండన్న తదితరులు ఉన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకే పాదయాత్ర
వనపర్తిటౌన్: ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్‌లో భాగంగా ప్రతి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి ఇర్షద్ అహ్మద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన పాలకులు.. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, నాయకులు సత్యారెడ్డి, వెంకటేష్, శ్రీలతారెడ్డి, దేవన్న యాదవ్, దేవిజా నాయక్, దివాకర్ యాదవ్, రోహిత్, జానకీ రాములు పాల్గొన్నారు.
నల్లమలలో పులుల గణన
కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు పులుల గణన చేపట్టారు. కొల్లాపూర్ సమీపంలోని నల్లమల అడవిలో రెండు రోజుల క్రితం గణన ప్రారంభించినట్లు ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫేజ్–4లో భాగంగా కొల్లాపూర్ రేంజ్‌లో బయాలజిస్టు రవికాంత్ నేతృత్వంలో పులులు, చిరుతల పాదముద్రలు సేకరిస్తున్నట్లు వివరించారు. అటవీ ప్రాంతంలో ప్రతి రెండు చదరపు కిలోమీటర్లకు ఒక కెమెరా ఏర్పాటు చేశామని, కెమెరాలో రికార్డు అయిన వన్యప్రాణులతోపాటు పాదముద్రల ఆధారంగా గణన కొనసాగుతుందని చెప్పారు. పులుల గణనలో స్థానిక ఫారెస్టు అధికారులతోపాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. గతేడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 9 పులులను గుర్తించామని ఆయన వెల్లడించారు.
‘పది’ పరీక్షలకు 14మంది గైర్హాజరు
‘పది’ పరీక్షలకు 14మంది గైర్హాజరు